ఎన్టీఆర్, హృతిక్‌రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’(WAR 2). భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేదు. దీంతో యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చే తదుపరి చిత్రం 'ఆల్పా'పై ఎక్కవ ప్రభావం చూపనుంది. ఈ స్పై యూనివర్స్ నుంచి ఇప్పటికే వచ్చిన పఠాన్, వార్-1 చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అయితే, వార్ 2తో ఈ ఫ్రాంచైజీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. దీంతో స్పై యూనివర్స్ నుంచి రానున్న చిత్రాలపై మిశ్రమ స్పందన వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఫ్రాంచైజీని కాపాడుకునేందుకు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)ను నిర్మాత ఆదిత్య చోప్రా సంప్రదించారని తెలుస్తోంది.
యశ్‌రాజ్ ఫిల్మ్స్; స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో విడుదల కానున్న చిత్రం 'ఆల్ఫా'.., ఇందులో అలియా భట్( Alia Bhatt), శార్వరి వాఘ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఇందులో బాబీ డియోల్, అనిల్ కపూర్ కూడా నటించారు. వార్ 2 పరాజయం కారణంగా, YRF అధినేత ఆదిత్య చోప్రా తమ ఫ్రాంచైజీ ఉణికిని కాపాడుకునేందుకు షారుఖ్ ఖాన్ సాయం కోరారని తెలుస్తోంది. 'ఆల్ఫా' చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో నటించాలని నిర్మాత ఆదిత్య చోప్రా కోరినట్లు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆల్ఫా దర్శకుడు శివ్ రావేల్ కూడా షారుఖ్ కోసం సరైన పాత్రను ప్లాన్ చేశారని టాక్.

యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలోని షారుఖ్ పాత్రకు బాలీవుడ్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల, ఆల్ఫాలో అతిధి పాత్రలో షారుఖ్ నటిస్తే సినిమాకు లాభం చేకూరుతుందని ఆదిత్య చోప్రా అభ్యర్థించినట్లు చెబుతున్నారు. కానీ, షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం కింగ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే, ఆదిత్య కోరికమేరకు షారుఖ్ ఖాన్ తన షెడ్యూల్స్‌ను మార్చుకోనున్నారట. 'ఆల్పా'లో ఆయన అతిధి పాత్రలో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. అయితే, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ స్పై యూనివర్స్‌లో రాబోతున్న మొదటి మహిళా గూఢచారి చిత్రంగా 'ఆల్ఫా' రానుంది. మునుపెన్నడూ చూడని భారీ యాక్షన్ సన్నివేశాలను ఇందులో చూడొచ్చని గతంలో ఈ చిత్ర దర్శకుడు శివ్ రావేల్ చెప్పారు.


