ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ ‘రుద్రవనం PS’ రివ్యూ.. | Naresh Agastya Rudravanam PS Series Review In Telugu | Sakshi
Sakshi News home page

Rudravanam PS Series Review: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ ‘రుద్రవనం PS’ రివ్యూ..

Nov 3 2026 3:27 PM | Updated on Nov 3 2026 3:40 PM

Naresh Agastya Rudravanam PS Series Review In Telugu

నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘రుద్రవనం పీఎస్‌’. శశిధర్ మున్నంగి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మొత్తం ఏడు ఎపిసోడ్స్ తెలుగులో ఉన్నాయి. ఇటీవలే జీ5 ఓటీటీలోకి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వరుస హత్యలు, పోలీసుల విచారణ, ఊహించని మలుపులతో సాగిన ఈ సిరీస్‌ చివరి వరకు ఆసక్తిని కొనసాగించిందా? నరేశ్ అగస్త్య నటన ఎలా ఉంది? ఓసారి రివ్యూలో చూద్దాం.

కథేంటంటే?
రుద్రవనం అనే మారుమూల గ్రామం అది.  శివకుమార్ (నరేశ్ అగస్త్య) సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుంటాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య శ్రావణిని ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. ఆమెకు డెలివరీ సమయం దగ్గర పడటంతో పది రోజుల సెలవు తీసుకోవాలని అనుకుంటాడు. అయితే అదే సమయంలో వరుసగా కొన్ని అనూహ్యమైన కేసులు అతడి ముందుకు వస్తాయి. అందులో ఎమ్మెల్యే భైరవుడు (రాజా రవీంద్ర) తమ్ముడికి సంబంధించిన కేసు కూడా ఉంటుంది. ఇంతలోనే ఓ తల లేని శవం కనిపించడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. అసలు ఆ శవం ఎవరిది? ఎమ్మెల్యే తమ్ముడికి, ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా? వరుసగా జరుగుతున్న నేరాల వెనుక ఉన్నది ఎవరు? వాటిని శివకుమార్ ఎలా ఛేదించాడు? అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే?
క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లలో కథ ఎంత ఆసక్తికరంగా ఉన్నా.. ప్రేక్షకులను చివరి వరకు కూర్చోబెట్టడం చాలా ముఖ్యం. ఈ విషయంలో దర్శకుడు శశిధర్ మున్నంగి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఏడు ఎపిసోడ్స్‌తో రూపొందించిన ఈ సిరీస్‌ మొదటి నుంచే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా తొలి రెండు ఎపిసోడ్స్‌లో వచ్చే సంఘటనలు వాటి వెనుక ఏదో మిస్టరీ దాగి ఉందనే భావన ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతాయి.

అలా ఐదు ఎపిసోడ్స్ వరకు కథను ఆసక్తికరంగా నడిపించాడు దర్శకుడు. పోలీసుల విచారణ, ఒక్కో కేసు వెనుక బయటపడే విషయాలు, ఊహించని మలుపులు బాగున్నాయి. మరోవైపు కుటుంబ సంబంధాలకు సంబంధించిన సన్నివేశాలు కూడా కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. హీరో, విలన్ ట్రాక్స్‌ను సమాంతరంగా నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే చివరి రెండు ఎపిసోడ్స్ దగ్గరకు వచ్చేసరికి కథలో ఆసక్తి తగ్గుతుంది. అప్పటివరకు ఉత్కంఠను పెంచిన దర్శకుడు.. ముగింపు విషయంలో మాత్రం తడబడ్డాడు. ప్రేక్షకులు ఊహించే విధంగానే కొన్ని సన్నివేశాలు సాగడం నిరాశ కలిగిస్తుంది. ముఖ్యంగా చివర్లో వచ్చే ట్విస్టులు అంతగా ఆశ్చర్యపరచవు. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు కూడా కథకు బలాన్ని చేకూర్చలేకపోయాయి.

హీరో భార్యకు సంబంధించిన ప్రేమకథను కూడా మధ్యలో చూపించారు. అయితే ప్రధాన కథతో పోలిస్తే ఈ ట్రాక్ అంతగా అవసరం లేదనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలను తగ్గించి, చివరి ఎపిసోడ్స్‌ను మరింత బలంగా రాసుకుని ఉంటే సిరీస్‌ స్థాయి మరోలా ఉండేది. థ్రిల్లర్ కథను మొదటి నుంచి ఆసక్తికరంగా నడిపించిన దర్శకుడు.. ముగింపులో మాత్రం ప్రేక్షకులకు కాస్త నిరాశ పరిచాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలో ‘రణబాలి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?)

ఎవరెలా చేశారంటే?
పోలీస్ అధికారి శివకుమార్ పాత్రలో నరేశ్ అగస్త్య తన నటనతో ఆకట్టుకున్నాడు. బాధ్యతగల పోలీస్ అధికారిగా, కుటుంబాన్ని ప్రేమించే భర్తగా రెండు కోణాల్లోనూ సహజంగా నటించాడు. ముఖ్యంగా విచారణ సమయంలో అతడి హావభావాలు, కేసును ఛేదించాలనే పట్టుదల బాగున్నాయి. సీనియర్ నటుడు బెనర్జీ పై అధికారిగా తన అనుభవాన్ని చూపించారు. రాజకీయ నాయకుడి పాత్రలో రాజా రవీంద్ర కూడా ఆకట్టుకున్నారు. చారు వాకన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు కథను ఆసక్తికరంగా నడిపించినప్పటికీ, చివరి ఎపిసోడ్స్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. ముఖ్యంగా ముగింపు బలంగా ఉంటే ఈ సిరీస్‌ ప్రేక్షకులకు మరింత గుర్తుండిపోయేది.

చివరిగా..
మొదటి ఐదు ఎపిసోడ్స్‌లో ఉత్కంఠను రేకెత్తిస్తూ, చివర్లో మాత్రం ఊహించదగిన మలుపులతో సాగిన క్రైమ్ థ్రిల్లర్ ‘రుద్రవనం పీఎస్‌’. నరేశ్ అగస్త్య నటన, పోలీస్ విచారణ సన్నివేశాలు, కథలోని మిస్టరీ ఆసక్తిని కలిగిస్తాయి. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు చూడాలనుకునే వారు ఒకసారి ప్రయత్నించవచ్చు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి కీర్తి సురేశ్‌ ‘అక్క’ రివ్యూ..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement