ట్రిపుల్‌ ఎయిట్‌...ఎంగేజ్డ్‌ | Naga Chaitanya gets engaged to Sobhita Dhulipala | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఎయిట్‌...ఎంగేజ్డ్‌

Aug 9 2024 12:21 AM | Updated on Aug 9 2024 12:21 AM

Naga Chaitanya gets engaged to Sobhita Dhulipala

‘‘నా తనయుడు నాగచైతన్య నిశ్చితార్థం శోభితా ధూళిపాళ్లతో ఈ రోజు (గురువారం) ఉదయం 9 గంటల 42 నిమిషాలకు జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. ఈ నూతన జంటకు శుభాకాంక్షలు. ప్రేమ, సంతోషాలతో వీరి జీవితాలు నిండిపోవాలని కోరుకుంటున్నాను.

8.8.8.. (ఎనిమిదో తేదీ... ఎనిమిదో నెల... 2024ని కూడితే ఎనిమిది) అనంతమైన ప్రేమకు నాంది.. శోభితా, నాగచైతన్య’’ అని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసి, నాగచైతన్య–శోభితల నిశ్చితార్థం ఫొటోలను షేర్‌ చేశారు అక్కినేని నాగార్జున. అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల  నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లోని అక్కినేని నాగార్జున ఇంట్లో జరిగింది. కాగా చైతన్య–శోభిత ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అడివి శేష్‌ నటించిన ఓ చిత్రానికి సంబంధించిన హౌస్‌పార్టీలో నాగచైతన్య, శోభితాలకు తొలిసారి పరిచయం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందని టాక్‌. ‘జోష్‌’తో హీరోగా ప్రయాణం మొదలుపెట్టి, ఇప్పుడు చేస్తున్న ‘తండేల్‌’ వరకూ నాగచైతన్య కెరీర్‌ గురించి అందరికీ తెలిసిందే. ఇక శోభితా ధూళిపాళ్ల విషయానికొస్తే... ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో వేణుగోపాల్‌ రావు, శాంతాకామాక్షి దంపతులకు జన్మించారు. ఆమెది బ్రాహ్మణ కుటుంబం.

2013లో ఫెమీనా మిస్‌ ఇండియా ఎర్త్‌ టైటిల్‌ విజేతగా నిలిచారామె. ఆ తర్వాత ‘రామన్‌ రాఘవ్‌ 2.ఓ’తో నటిగా శోభిత ప్రయాణం హిందీలో మొదలైంది. ‘బార్డ్‌ ఆఫ్‌ బ్లడ్, మేడ్‌ ఇన్‌ హెవెన్, ది నైట్‌ మేనేజర్‌’ వంటి హిందీ వెబ్‌ సిరీస్‌ల ద్వారానూ పాపులర్‌ అయ్యారు. 2018లో వచ్చిన అడివి శేష్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘గూఢచారి’లో ఓ లీడ్‌ రోల్‌లో నటించారు శోభిత. ‘మేజర్‌’లోనూ ఓ ముఖ్య పాత్ర చేశారు. హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘మంకీ మ్యాన్‌’లోనూ నటించారు. ఇక 2017లో నాగచైతన్య–సమంత పెళ్లి చేసుకున్న విషయం, 2021లో విడిపోయిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement