బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్ అరెస్ట్ అయ్యారు.. కొద్దిరోజుల క్రితం ముంబైలో ఓ నివాసంలో కాల్పులు జరిగిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ కాల్పులకు పాల్పడింది కమల్ రషీద్ అని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. దీంతో శుక్రవారం రాత్రి కమల్‌ను అంధేరీ పోలీసులు అరెస్ట్ చేశారు.
కమల్ రషీద్ ఖాన్ అంటే ఎవరు గుర్తుపట్టరేమో కానీ.. కేఆర్కే అంటే వెంటనే కనిపెట్టేస్తారు. అంతలా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాలపై నెగెటివ్ రివ్యూలు ఇస్తూ హల్ చల్ చేసేవారిలో కేఆర్కే ఒకరు. తనకు తానుగా సినీ విమర్శకుడిగా ఆయన చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో కూడా నటించారు. అయితే, రచయిత-దర్శకుడు నీరజ్ కుమార్ మిశ్రా నివసించే అంధేరీలోని ఒక నివాస భవనంపై కమల్ రషీద్ నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.

జనవరి 18న తన లైసెన్స్ తుపాకీతో కాల్పులు జరిపినట్లు అతను అంగీకరించాడు. అయితే, తాను ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరపలేదని.. తన గన్‌ను శుభ్రం చేసిన తర్వాత ఫారెస్ట్ వైపు కాల్పులు జరిపానన్నారు. పొరపాటున బుల్లెట్లు ఆ భవనం వైపు వెళ్లినట్లు ఆయన తెలిపారు. గతంలో నటుడిగా, దర్శకుడిగా పనిచేసిన ఖాన్, ఎవరికీ హాని కలిగించే ఉద్దేశ్యం తనకు లేదని విచారణలో చెప్పాడని పోలీసులు తెలిపారు. అయితే, కాల్పుల వెనుక గల ఉద్దేశ్యం ఇంకా అస్పష్టంగానే ఉంది. అదే భవనం నాలుగో అంతస్తులో మోడల్ ప్రతీక్ నివసిస్తుండటం గమనార్హం.


