ఉత్తరప్రదేశ్‌లోని కుంభమేళాలో పూసలు అమ్ముతూ, తన కనులతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన మోనాలిసా ‘లైఫ్’ సినిమాతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతున్నారు. శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి చరణ్ హీరోగా నటిస్తున్నారు. వెంగమాంబ క్రియేషన్స్‌పై అంజన్న నిర్మిస్తున్న ‘లైఫ్’ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూజతో ఈ చిత్రం ప్రారంభమైంది.
మంచి మెసేజ్ ఇచ్చే మూవీ..
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డీఎస్ రావ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటులు సురేష్ క్లాప్ కొట్టగా, శివన్నారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా అంజన్న మాట్లాడుతూ.. ‘‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీవితాల్లో చోటు చేసుకుంటున్న ఘటనల ఆధారంగా ‘లైఫ్’ రూపొందుతోంది’’ అని తెలిపారు. ‘‘ఈ చిత్రకథలో నేటి తరానికి చక్కటి సందేశం ఉంది’’ అని శ్రీను కోటపాటి చెప్పారు. ‘‘యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే కథాంశంతో మా సినిమా రూపొందుతోంది’’ అన్నారు సాయి చరణ్. ‘‘నేను తెలుగు సినిమా చేస్తుండడం చెప్పలేని ఆనందంగా ఉంది. త్వరలో తెలుగు నేర్చుకుంటాను’’ అని మోనాలిసా పేర్కొన్నారు.


