
వెండితెర నీటిమయం కానుంది. ఎందుకంటే నీటిలో వీరోచిత యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నారు కొందరు తెలుగు హీరోలు. కొందరు నీటి పై... మరి కొందరు నీటి లోపల వాటర్ సీక్వెన్స్ చేస్తున్నారు. ఇలా ప్రత్యర్థులతో ‘వాటర్‌లో వార్’ చేస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.
బురదలో ఫైట్
వాటర్‌లో ఫైట్ సీక్వెన్స్‌లను చాలా సినిమాల్లో చేశారు చిరంజీవి. కానీ... తొలిసారిగా కాస్త బురద ఉండే వాటర్ ఫైట్ సీక్వెన్స్‌ను ‘విశ్వంభర’ సినిమా కోసం చేశారాయన. ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఓ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉందని, ఈ ఫైట్‌ను ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా డిజైన్ చేశారని సమాచారం. ఈ చిత్రంలో ఆంజనేయ స్వామి భక్తుడు భీమవరం దొరబాబు పాత్రను చిరంజీవి పోషిస్తున్నారని తెలిసింది.
త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక పాట మినహా పూర్తయిందట. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్, వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్ లేదా ఆగస్టులో ‘విశ్వంభర’ విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది.
పడవలో ఫైట్
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకులు. మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేస్తుండగా, హీరోయిన్‌గా పంచమి అనే పాత్రలో నిధీ అగర్వాల్ నటిస్తున్నారు.
ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కనిపిస్తారు. ఈ సినిమాలో ఓ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉందని తెలిసింది. ఈ సీన్ సినిమా ఆరంభంలోనే వస్తుందట. ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ‘హరిహర వీరమల్లు’ రెండు భాగాలుగా రూపొందుతోంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం త్వరలో విడుదల కానుంది.
పడవల్లో గొడవ
పడవ ప్రయాణంలో ప్రత్యర్థులతో గొడవ పడుతున్నారట మహేశ్‌బాబు. ఇది ఏ రేంజ్ గొడవ అనేది థియేటర్స్‌లో చూడాలి. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఇటీవల హైదరాబాద్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట రాజమౌళి.
ఈ చిత్రంలో ప్రధాన తారాగణమైన మహేశ్‌బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొనగా, వీరితో పాటు దాదాపు మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారని సమాచారం. ఈ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను ఓ భారీ సెట్‌లో చిత్రీకరించారట. ఈ బోట్ యాక్షన్ సీక్వెన్స్‌ని హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ డిజైన్ చేశారని భోగట్టా. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుందని సమాచారం.
సముద్రంలో దేవర
తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘దేవర’. ఈ చిత్రంలో తండ్రి దేవరగా, కొడుకు వరగా ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను మెప్పించింది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘దేవర’ తొలి భాగంలో సముద్రంలో జరిగే యాక్షన్ సీక్వెన్స్‌లను చూశాం. అలాగే ‘దేవర 2’లోనూ ఆ తరహా వాటర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలిసింది. తొలి భాగంలో సముద్రం అడుగు భాగాన కొన్ని అస్థిపంజరాలు ఉన్నట్లుగా చూపించారు.
వీటి వెనక దాగి ఉన్న యాక్షన్ ఎపిసోడ్ ‘దేవర 2’లో ఉంటుందని తెలుస్తోంది. ఇంకా రెండో భాగం షూటింగ్ ఆరంభం కాలేదు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. కల్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ ‘దేవర’ చిత్రాన్ని నిర్మించారు. ఈ నిర్మాతలే ‘దేవర 2’ని కూడా నిర్మిస్తారని ఊహించవచ్చు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చాక ‘దేవర 2’ షూట్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.
సాహసాల సూపర్ యోధ
సూపర్ యోధగా సాహసాలు చేస్తున్నారు తేజ సజ్జా. ఈ సాహసాల విజువల్స్ ఆగస్టులో థియేటర్స్‌లో చూడొచ్చు. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘మిరాయ్’ అనే ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ రూపొందుతోంది. ఈ సినిమాలో ఓ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉందని భోగట్టా. యాక్షన్‌తో పాటు ఆధ్యాత్మిక అంశాలు కూడా మిళితమై ఉన్న ఈ సినిమాకు చెందిన ఓ లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ శ్రీలంకలో జరిగింది.
ఆ షెడ్యూల్‌లో ఓ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఓ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ కూడా తీశారని సమాచారం. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 1న విడుదల కానుంది. ఇలా వాటర్‌లో జరిగే యాక్షన్ ఎపిసోడ్స్‌తో మరికొన్ని చిత్రాలు రానున్నాయి.