MAA Elections 2021: ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా

Manchu Vishnu Released Video Message On MAA Elections In Twitter - Sakshi

లేకుంటే పోటీకి సిద్ధం!

‘మా’ బిల్డింగ్‌ ఖర్చంతా నేనే భరిస్తా!

Manchu Vishnu On Maa Elections: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష పదవికి ఈసారి విష్ణు మంచు పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం విష్ణు ఓ ప్రకటన విడుదల చేశారు. దాని సారాంశం ఈ విధంగా...
‘‘మా’కి సొంత భవనం కట్టాలని 12 ఏళ్లుగా అందరూ అంటూనే ఉన్నారు. ‘మా’ అధ్యక్షునిగా మురళీమోహన్‌గారు, ఉపాధ్యక్షునిగా నేను ఉన్నప్పుడు జరిగిన జనరల్‌ బాడీ మీటింగ్‌కి అక్కినేని నాగేశ్వరరావుగారు వచ్చారు. ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో 25 శాతం నేను, నా కుటుంబం ఇస్తామని అప్పుడు చెప్పాను.. అయితే ఇప్పుడు ఆ బిల్డింగ్‌ నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా నేనే ఇస్తాను.. నా కుటుంబంతో కలిసి ఆ బిల్డింగ్‌ని నిర్మించాలని తాజాగా నిర్ణయించుకున్నాను.

సినీ పెద్దలు కృష్ణ, కృష్ణంరాజు, సత్యనారాయణ, నాన్న, మురళీమోహన్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, జయసుధ, రాజశేఖర్, జీవిత, రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావుగార్లతో పాటు ఇంకా కొంతమంది పెద్దలు కూర్చుని ‘మా’ అధ్యక్షుణ్ణి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వాళ్ల నిర్ణయానికి కట్టుబడతాను. ఏకగ్రీవం కాని పక్షంలో పోటీ చేస్తాను. 
తెలుగు పరిశ్రమ హైదరాబాద్‌ వచ్చాక 1993లో అక్కినేని నాగేశ్వరరావు, ప్రభాకర్‌ రెడ్డి, నాన్న (మోహన్‌బాబు), చిరంజీవిగార్లతో పాటు మరికొందరు పెద్దలు కలిసి ‘మా’ను ఏర్పాటు చేశారు. నాన్నగారు ‘మా’ పదవిలో ఉన్నా, లేకపోయినా సినీ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉన్నారు.
1990లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సినీ కార్మికుల కోసం (చిత్రపురి కాలనీ) స్థలాన్ని కేటాయించింది. 1997లో దాన్ని ఒక పెద్ద రాజకీయ నాయకుడు తన ఫ్యాక్టరీ కోసం సొంతం చేసుకుందామని ప్రయత్నిస్తే, నాన్నగారు అప్పటి గవర్నర్‌ రంగరాజన్‌గారిని కలిసి ఆ స్థలాన్ని సినీ కార్మికులకే దక్కేలా చేశారు. ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను, నా కుటుంబం అండగా నిలబడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి కార్మికుల కోసం పోరాడి న్యాయం చేయించాం.

‘ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా మోహన్‌బాబుని కలువు, నీకు సహాయం చేస్తారు’ అని నటుడు సునీల్‌కి తోటి నటీనటులు చెప్పారట. దీంతో నాన్నగారిని కలిశానని, సమస్య పరిష్కారం అయిందని సునీల్‌ నాతో చెప్పాడు. 
ఇప్పటివరకూ ‘మా’ అధ్యక్షులుగా చేసినవారు మంచి పనులు చేశారు. ‘మా’లో చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు. అయితే అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని అనుకుంటున్నాను. గతాన్ని తవ్వుకోకుండా ముందుకెళ్లి మంచి పనులు ఎలా చేయాలో ఆలోచిద్దాం.
మన ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌ యూనియన్‌ సభ్యులే సినిమాల్లో పని చేయాలి. అయితే సభ్యత్వం లేనివాళ్లూ పని చేస్తున్నారు. కొత్తవాళ్లను ప్రోత్సహించడం తప్పు కాదు. కానీ ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలన్నదే మొదటి రూల్‌. ప్రతి ప్రొడక్షన్‌ హౌస్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ‘మా’ సభ్యులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరాలి. దేశంలోని అన్ని సినీ అసోసియేషన్స్‌తో ‘మా’ గట్టి సంబంధాలు కలిగి ఉండాలి. ‘మా’ బలపడాలి.
సినీ పెద్దలను గౌరవిస్తాం.. వాళ్ల సలహాలు పాటిస్తాం.. మా యంగ్‌ జనరేషన్‌ని ఆశీర్వదించి ‘మా’ అధ్యక్షునిగా నన్ను ఆశీర్వదించండి’’ అని మంచు విష్ణు పేర్కొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top