
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం పరమ్ సుందరి. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కనిపించనుందగి. ఈ లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఇటీవల ట్రైలర్ విడుదల కాగా ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఈ నెలఖార్లో విడుదల కానున్న ఈ సినిమా.. ట్రైలర్ వల్లే ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. చర్చిలో రొమాంటిక్ సీన్ పెట్టడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సీన్లను తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో జాన్వీని మలయాళీ అమ్మాయిగా కనిపించనుంది.
ఇటీవల ఈ మూవీ ట్రైలర్ చూసిన మలయాళ నటి, సింగర్ పవిత్ర మీనన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందీ సినిమాలో మలయాళీలను తప్పుగా చిత్రీకరించే ధోరణిని విమర్శించింది. కేరళ నేపథ్యంలో తెరకెక్కించే సినిమాల్లో మలయాళీ నటులను తీసుకోకపోవడాన్ని పవిత్ర తప్పుపట్టింది. 'మై తెక్కపాటిల్ దామోదరన్ సుందరం పిళ్లై కేరళ సే' అంటూ జాన్వీ కపూర్ చెప్పిన డైలాగ్ను ప్రస్తావించింది. పరమ్ సుందరి మేకర్స్ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేసింది.
వీడియో పవిత్ర మీనన్ మాట్లాడుతూ.. "నేను మలయాళీని. జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా మూవీ పరమ సుందరి ట్రైలర్ చూశా. కేరళ అమ్మాయిగా జాన్వీ కపూర్ పాత్ర పోషించింది. ఇలాంటి రోల్కు మలయాళీ హీరోయిన్ను తీసుకోవచ్చు కదా. మలయాళీలను తీసుకోవడం మీకేంటి సమస్య. మాకు టాలెంట్ లేదనుకుంటున్నారా?. కేరళలో అయితే ఇలా జరగదు. నేను హిందీలో ఎలా మాట్లాడుతున్నానో.. మలయాళం కూడా బాగా మాట్లాడగలను. హిందీ సినిమాలో ఆ పాత్ర పోషించడానికి మలయాళీ దొరకడం అంత కష్టందా ఉందా?" అని ప్రశ్నించింది.
"1990ల్లో మలయాళ చిత్రాల్లో పంజాబీలను చూపించాల్సి వచ్చినప్పుడు మేము అలాంటివి చేశాం. కానీ ఇది 2025. మలయాళీ ఎలా మాట్లాడతాడో.. ఇతరుల మాదిరిగానే ఎలా సాధారణంగా ఉంటారో అందరికీ తెలుసని అనుకుంటున్నా. మేము మల్లెపూలు ధరించడం లేదు. ప్రతిచోటా మోహినియాట్టం కూడా చేస్తాం. జాన్వీ అంటే నాకు ద్వేషం లేదు. కానీ ఇంత కష్టంగా ఎందుకు ప్రయత్నించాలి?" అని పవిత్ర తన క్యాప్షన్‌లో స్పష్టం చేసింది. పవిత్ర వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కాగా.. పరమ్ సుందరి ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది.