
తొలి అర్ధ సంవత్సరంలో మలయాళ సినిమా రంగం ఊహించని మలుపులు తిరిగింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ సినిమాల మాదిరిగానే మలయాళ ఇండస్ట్రీనూ భారీగా విస్తరించినా, ఈ ఏడాది మొదటి ఆరు నెలలు కొన్ని సినిమాలు జయాపజయాల అంచనాల్ని తలకిందులుగా చేసి, సినీ అభిమానులను ఆశ్చర్యపరిచాయి.
టాప్ స్టార్ల నుంచి మిశ్రమ ఫలితాలు
మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈసారి డబుల్ హిట్‌తో బాక్సాఫీస్‌లో సందడి సృష్టించాడు. విలక్షణ నటుడు, హీరో పృథ్విరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎంపురాన్’ (ఎల్2) రాజకీయ థ్రిల్లర్‌గా రూ.265 కోట్లు వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే సమయంలో ఆయన నటించిన ‘తుదరుం’ కూడా రూ.230 కోట్ల కలెక్షన్స్‌తో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మరోవైపు మళయాళ మెగాస్టార్‌గా పేర్కొనే మమ్ముట్టి మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. ఆయన ఈ అర్ధభాగంలో తక్కువ ప్రభావం చూపించాడు. ఆయన నటించిన ‘డొమినిక్’, ‘లేడీస్ పర్స్’ లాంటి సినిమాలు ప్రేక్షకుల మన్నన పొందలేకపోయాయి.
చిన్న సినిమాలకు పెద్ద ఆదరణ
వినూత్న కధాంశాలు, వైవిధ్య భరిత చిత్రాలకు పెద్ద పీట వేసే తమ మనస్తత్వాన్ని మరోసారి మళయాళీలు చాటుకున్నారు. ఆసక్తికరమైన కథాంశంతో వచ్చిన కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అసిఫ్ అలీ – అనస్వర రాజన్ జంటగా నటించిన ‘రేఖాచిత్రం’ విమర్శకుల ప్రశంసలు పొందింది. అలాగే, కుంచక్కో బోబన్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’, టోవినో థామస్ నటించిన ‘నరివెట్ట’ వంటి థ్రిల్లర్ చిత్రాలు కూడా తమ సత్తా చాటాయి.
గుర్తింపుకు నోచుకోలేకపోయిన ఐడెంటిటీ...
భారీ అంచనాలతో వచ్చిన ఐడెంటిటీ మాత్రం సరైన గుర్తింపునకు నోచుకోలేక చతికిలపడింది. టోవినో థామస్, త్రిష లాంటి అగ్రతారలు ఉన్నా కథలో లోపాల వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అదే వారం విడుదలైన ‘కమ్యూనిస్టుపచ్చ అదవా అప్పా’, ‘ఐడి: ది ఫేక్’ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.
ఈ అర్ధ సంవత్సరం మళయాళ పరిశ్రమలో స్పష్టంగా కనిపించిన విషయం అదీ ఇదీ అని తేడా లేకుండా భిన్న రకాల కధలను ప్రేక్షకులు కోరుకుంటున్నారని, కధలో కొత్తదనం, ప్రేక్షకుల అభిరుచులకు దగ్గరగా ఉండే ప్రెజెంటేషన్. థ్రిల్లర్, రాజకీయ నాటకాలు ఆదరణ పొందగా, కుటుంబ భావోద్వేగాలు చిత్ర జయాపజయాల్లో తమ పాత్రను ఎప్పటికీ సజీవంగా ఉంచుతాయని కూడా వెల్లడైంది.
మోహన్‌లాల్ సినిమాల ఘనవిజయాలు మళయాళ సినీ పరిశ్రమకు ఉన్న బాక్సాఫీస్ సత్తాను చాటగా, చిన్న సినిమాల విజయం కొత్త ఆశల్ని అందించింది. ఇక రెండో అర్ధ సంవత్సరంలో పరిశ్రమ ఎలా ముందుకెళ్తుందో చూడాలి..