రెండేళ్ల క్రితం చావును దగ్గరి నుంచి చూశానంటోంది మలయాళ నటి, దర్శకురాలు, యాంకర్ రంజిని మీనన్. లైఫ్ సజావుగా సాగుతున్న సమయంలో స్ట్రోక్ వచ్చిందంటూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. 2024 నవంబర్ 18.. ఎర్నాకుళంలోని టీడీఎమ్ హాల్‌లో నేను మాట్లాడాల్సి ఉంది. అయితే స్పీచ్ ఇవ్వడానికి వెళ్లేముందు నా భర్త రాజగోపాల్‌తో కలిసి కాఫీ తాగాలనుకున్నాను.
మూతి వంకర
కానీ కాఫీ తాగుతుంటే కిందపడుతోంది. నా మాటలు కూడా వంకరపోతున్నాయి. అది చూసి నా కొడుకు ఆటపట్టిస్తుంటే లైట్ తీసుకున్నాను. నా భర్త నన్ను గమనించి హాస్పిటల్‌కు వెళ్దామన్నాడు. లేదు, ఈవెంట్‌కు అర్జంట్‌గా వెళ్లాలని చెప్పాను. ఫోన్‌లో టైప్ చేయడానికి కూడా నా శరీరం సహకరించలేదు. తీరా హాల్‌కు వెళ్లేసరికి నా పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది.
బ్రెయిన్ స్ట్రోక్‌తో పాటు గుండెపోటు
నా మాట పూర్తిగా మారిపోయింది. అది గమనించి చక్కెర కలిపిన నీళ్లు ఇచ్చారు. అది తాగగానే హఠాత్తుగా కింద పడిపోయాను. ఆస్పత్రికి తీసుకెళ్లగా నాకు బ్రెయిన్ స్ట్రోక్‌తో పాటు గుండెపోటు వచ్చిందన్నారు. నా మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టింది. దానివల్ల కుడివైపు శరీరం బలహీనంగా మారిపోయింది. కొన్ని జ్ఞాపకాలు చెదిరిపోయాయి. ఇక అవే నా చివరి క్షణాలనుకున్నాను. ఐసీయూలో కొన్నిరోజులపాటు ఉంచారు. ఐసీయూలో ఒక్కరోజు ఉన్నా సరే అది మనకు జీవితమంటే ఏంటో నేర్పిస్తుంది.
మళ్లీ నడక నేర్చుకున్నా..
నాకు జ్ఞాపకశక్తి ఉందా? కోల్పోయానా? అని తెలుసుకునేందుకు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం చదివేవాన్ని. నాలుగురోజులకు నన్ను డిశ్చార్జ్ చేశారు. ఐదో రోజు వీల్‌చైర్‌లోనే టీడీఎమ్ హాల్‌కు వెళ్లాను. తర్వాత ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాను. అక్కడే మళ్లీ నడక నేర్చుకున్నాను. మామూలు మనిషినయ్యాను. మన గురించి మనం పట్టించుకోకుండా పరుగులు పెట్టడం ఎంత తప్పో అప్పుడు నాకర్థమైంది అని రంజిని చెప్పుకొచ్చింది.


