విడుదలకు ముందే వివాదం.. రష్మిక చిత్రాన్ని అడ్డుకుంటామంటూ వార్నింగ్! | Maharashtra Cabinet Minister Uday Samant On Vicky Kaushal Chhaava | Sakshi
Sakshi News home page

Chhaava Movie: వివాదంలో రష్మిక చిత్రం.. రిలీజ్‌ కానివ్వమంటూ వార్నింగ్!

Jan 27 2025 3:09 PM | Updated on Jan 27 2025 7:40 PM

Maharashtra Cabinet Minister Uday Samant On Vicky Kaushal Chhaava

పుష్ప భామ రష్మిక మందన్నా ప్రస్తుతం ఛావా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో విక్కీ కౌశల్  సరసన నటించింది. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల ఛావా ట్రైలర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే వివాదానికి కారణమైంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

ఛావా మూవీపై మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలోని ఒక డ్యాన్స్ సీన్‌పై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ సీన్‌ తొలగించకపోతే సినిమాకు విడుదలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఛత్రపతి చరిత్రను ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పే ఇలాంటి ప్రయత్నాలు అవసరమని.. అయితే ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారని మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా.. ఈ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించడంపై మంత్రి మండిపడ్డారు. దర్శకుడు ఆ సీన్‌ కట్ చేయాలని.. అంతేకాదు ఈ సినిమాను చరిత్రకారులు, మేధావులకు చూపించాలని అన్నారు. వారు ఏదైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఈ సినిమా విడుదల కాదని స్పష్టం చేశారు. చిత్ర నిర్మాతలు చరిత్రకారులను సంప్రదించి వివాదాస్పద కంటెంట్‌ ఉంటే విడుదలకు ముందే తొలగించాలని సమంత్ పిలుపునిచ్చారు. మేం సూచించిన మార్పులు చేయకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. మహారాజ్ గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. కాగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.

ఆ సీన్లు తొలగిస్తాం.. డైరెక్టర్

శంభాజీ మహారాజ్.. మహారాణి యేసుబాయితో కలిసి నృత్యం చేస్తున్న దృశ్యాలను తొలగిస్తున్నట్లు చావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ వెల్లడించారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేతో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం డ్యాన్స్ సీక్వెన్స్ మాత్రమేనని.. మరాఠా రాజు వారసత్వం కంటే మరేది ముఖ్యం కాదని ఉటేకర్ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement