
దివంగత లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ చాలా ఏళ్ల తర్వాత 'లైఫ్'(లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్‌పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తున్నారు. భావన పోలేపల్లి కాస్ట్యూమ్ డిజైనర్. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మల్లా రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్బంగా హీరో శ్రీ హర్ష మాట్లాడుతూ.. 'ముందుగా ముఖ్య అతిధి మల్లా రెడ్డికి కృతజ్ఞతలు. ఆయన ఈ సినిమాలో నటించి ఉంటే, పాన్ వరల్డ్ సినిమా అయ్యేది. ఈ సినిమాని నిర్మించిన తన తండ్రి రామ స్వామి రెడ్డికి కృతజ్ఞతలు. ఇంత అద్భుతంగా తీసిన డైరెక్టర్ పవన్ కేతరాజుకి ఎంతో రుణపడి ఉంటా. మణి శర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తన సినిమాకి సంగీతం ఇవ్వడం తన అదృష్టం. అలాగే సింగర్ ఎస్పీ చరణ్, నటుడు ప్రవీణ్‌తో కలిసి పని చెయ్యడం చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు.
ఎమ్మెల్యే మల్లా రెడ్డి మాట్లాడుతూ.. 'ముందుగా ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో తీశారని తెలిసి ఆశ్చర్యపోయా. హీరో శ్రీ హర్ష తమిళ హీరో విజయ్ కంటే స్మార్ట్‌గా ఉన్నారు. శ్రీ హర్ష తమ కాలేజీ స్టూడెంట్.. అతని తండ్రి తమ కాలేజీ ప్రిన్సిపాల్.. వీరు సినిమా చెయ్యడం తనకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాలో పని చేసిన నటినటులకి నా అభినందనలు. డైరెక్టర్ ప్రవీణ్ కేతరాజు ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవ్వాలి' అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక డైరెక్టర్ పవన్ మాట్లాడుతూ.. 'తమని దీవించడానికి వచ్చిన ముఖ్య అతిధి మల్లా రెడ్డికి నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. చరణ్ ఈ సినిమా చేయబట్టే చాలా అద్భుతంగా వచ్చింది. బాల సుబ్రహ్మణ్యం చరణ్‌ను మనకు గిఫ్ట్‌గా ఇచ్చారు. బాల సుబ్రహ్మణ్యం ఎక్కడున్నా మమ్మల్ని దీవిస్తూ ఉంటారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు' అని అన్నారు.
సింగర్ ఎస్పీ చరణ్ మాట్లాడుతూ.. 'వేదిక మీద ఉన్న పెద్దలందరికి నమస్కారం. తన క్యారెక్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేసిన డైరెక్టర్ పవన్ కేతరాజుకు ధన్యవాదాలు . ఈ సినిమా హీరో శ్రీ హర్ష చాలా కష్ట పడ్డారు. వారణాసిలో ఆయన పడ్డ కష్టాన్ని గుర్తు చేశారు. ఈ సినిమా శ్రీ హర్షకి మంచి సక్సెస్ ఇవ్వాలి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినందుకు కషికకి స్పెషల్ థాంక్స్. అలాగే ఎంతో సపోర్టింగ్ యాక్ట్ చేసిన నటుడు ప్రవీణ్‌కు నా కృతజ్ఞతలు. ఇంతమంచి సినిమాలో తాను పాడేందుకు అవకాశం ఇవ్వనందుకు కోపంగా ఉన్నానని సరదాగా' అన్నారు. ఈ చిత్రంలో చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిినిమాను ఏప్రిల్ 4వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.