Love Me Movie Review: ‘లవ్‌ మీ’మూవీ రివ్యూ | Love Me If You Dare 2024 Movie Review And Rating In Telugu | Ashish Reddy | Vaishnavi Chaitanya | Sakshi
Sakshi News home page

Love Me If You Dare Review: దెయ్యంతో ప్రేమాయణం.. ‘లవ్‌ మీ’ ఎలా ఉందంటే..

Published Sat, May 25 2024 2:24 PM

Love Me If  You Dare Movie Review And Rating In Telugu

టైటిల్‌: లవ్‌ మీ
నటీనటులు: ఆశీష్ రెడ్డి, వైష్ణవి చైతన్య, సిమ్రాన్ చౌదరి, రాజీవ్ కనకాల, రవి కృష్ణ తదితరులు
నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, హర్షిత రెడ్డి
దర్శకుడు: అరుణ్ భీమవరపు
సంగీతం: ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్
విడుదల తేది: మే 25, 2024

దెయ్యం తో లవ్...అని చెప్పగానే అందరికీ ‘లవ్ మీ’ సినిమా పై ఆసక్తి పెరిగింది. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆ ఆసక్తిని మరింత పెంచాయి. ఇలా భారీ అంచనాలతో నేడు(మే 25) ప్రేక్షకుల ముందకు వచ్చిన ‘లవ్‌ మీ’ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
అర్జున్‌ (ఆశిష్‌ రెడ్డి), ప్రతాప్‌(రవికృష్ణ) ఇద్దరు యూట్యూబర్స్‌. మూఢనమ్మకాలపై జనాల్లో ఉన్న అపోహాలను పోగొట్టేలా వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటారు. ప్రతాప్‌ ప్రియురాలు ప్రియ(వైష్ణవి చైతన్య) అప్పుడప్పుడు వీరికి సహాయం చేస్తుంటుంది. ఓ సారి ప్రతాప్‌ తమ ఊర్లో జరిగిన మిస్టరీని ఛేదించాలని దానిపై ఇన్వెస్టిగేషన్‌ చేస్తుంటాడు. కొన్నాళ్ల క్రితం ఆ ఊర్లో నుంచి దివ్యవతి(సంయుక్త మీనన్‌)అనే చిన్నారి మిస్‌ అవుతుంది. కొన్నాళ్ల తర్వాత ఆమె ఆంధ్రా కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో సూసైడ్‌ చేసుకొని చనిపోతుంది. 

ఆ తర్వాత ఆ అపార్ట్‌మెంట్‌ నుంచి కొన్ని శబ్దాలు వినిపించడంతో దివ్యవతి దెయ్యం అయిందని ఎవరూ అటువైపు వెళ్లరు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఆ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి ప్రతి ఒక్కరు చనిపోతుంటారు. ప్రియ ఈ సమాచారం అంతా సేకరించి ప్రతాప్‌కి చెబుతుండగా.. అర్జున్‌ వింటాడు. ఎవరైనా ఏదైనా చేయవద్దు అంటే ఆ పని చేయాలనుకునే స్వభావం ఉన్న అర్జున్‌.. ఆ దివ్యవతి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఈ మిస్టరీని ఛేందించేందుకు ఒక్కడే ఆ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దివ్యవతి ఎవరు? ఆ అపార్ట్‌మెంట్‌లో నిజంగానే దెయ్యం ఉందా? ఉంటే అర్జున్‌ని ఎందుకు చంపలేదు? వేరు వేరు ఊర్లల్లో మిస్సింగ్‌ అయిన వెన్నెల, నూర్‌, పల్లవిలకు దివ్యవతికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఈ మిస్టరీ అర్జున్‌ ఎలా ఛేదించాడు? అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే.. 
బేస్‌మెంట్‌ సరిగా లేకుంటే.. ఆ ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దిన సరే ప్రయోజనం ఉండదు. అలాగే ఓ సినిమాకి కథ-కథనం కూడా బేస్‌మెంట్‌ లాంటిదే. కథలోని మెయిన్‌ పాయింట్‌ బలంగా ఉంటే..సాదారణంగా తెరకెక్కించినా ప్రేక్షకులు ఆదరిస్తారు. అంతేకానీ కథలోని అసలు పాయింటే బలహీనంగా.. అర్థవంతంగా లేకుంటే ఎంత రిచ్‌గా తీర్చిదిద్దినా..ఆడియన్స్‌ కనెక్ట్‌ కాలేరు. లవ్‌ మీ విషయంలో దర్శకుడు అదే పొరపాటే చేశాడు. ఇంతవరకు ఎవరూ ఎంచుకొని ఓ యూనిక్‌ పాయింట్‌ని ఎంచుకొని దాని చుట్టు మంచి సన్నివేశాలను అల్లుకున్నాడు. కానీ అసలు పాయింట్‌ దగ్గరే కన్ఫ్యూజన్ క్రియేట్‌ చేశాడు. అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో కూడా అర్థం కాదు. హారర్‌ సన్నివేశాలతో సినిమాను ప్రారంభించి లవ్‌ స్టోరీ, మర్డర్‌ మిస్టరీగా కథనాన్ని సాగించాడు.

ప్రధాన పాత్రని తీర్చిదిద్దిన విధానం.. ప్లాష్‌ బ్యాక్‌ స్టోరీ అస్సలు రుచించదు. ఆ పాత్ర ఎందుకు అలా ప్రవర్తించిందో చెప్పిన కారణం మరింత సిల్లీగా అనిపిస్తుంది. అలాగే ఒకరితో ప్రేమలో ఉంటూనే మరొకరితో ప్రేమలో పడడం.. దానికి బలమైన కారణం కూడా లేకపోవడంతో ఆ లవ్‌స్టోరీకి ప్రేక్షకుడు కనెక్ట్‌ కాలేడు. ఇక దెయ్యంతో హీరో ప్రేమలో పడడం కూడా ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. భయంతోనే దెయ్యంతో ప్రేమలో పడ్డానని హీరో చెప్పడం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది.

 సినిమాలో హీరో చెప్పులు వేసుకోడు..దానికేదో బలమైన కారణం ఉంటుందని సగటు ప్రేక్షకుడు కచ్చితంగా ఊహిస్తాడు. కానీ దర్శకుడు ఓకే ఒక షాట్‌లో దానికి కారణం ఏంటో చూపించాడు. అయితే ఆ రీజన్‌ చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. అలాంటి సీన్లు సినిమాలో చాలానే ఉంటాయి. హీరో అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశాలు ఇటు ఎంటర్‌టైన్‌మెంట్‌ అదించలేదు.. అలా అని అటు పూర్తిగా భయపెట్టలేవు. గతంలో చూసిన సాధారణ లవ్‌స్టోరీ మాదిరి కథనం సాగుతుంది.  హీరో చేసే ఇన్వెస్టిగేషన్‌ కూడా రొటీన్‌గా ఉండడమే కాకుండా..గందరగోళానికి గురి చేస్తాయి.  క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ ముందుగానే ఊహించొచ్చు. 

ఎవరెలా చేశారంటే.. 
అశీష్‌ రెడ్డికి ఇది రెండో సినిమా. అయినా కూడా నటన పరంగా ఇంకాస్త శిక్షణ అవసరమేమో అనిపిస్తుంది. సినిమా మొత్తం ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్‌తో కనిపిస్తాడు. సీన్‌కి తగ్గట్లుగా తన ఎక్స్‌ప్రెషన్స్‌ మార్చుకోలేకపోయాడు. అలాగే ఇందులో ఆయన పాత్రని ఎలివేట్‌ చేసే సన్నివేశాలు కూడా లేవు. ఇక బేబి తర్వాత వైష్ణవి చైతన్య నటించిన చిత్రమిది. ఆమె పాత్ర పరిధిమేర బాగానే నటించింది. అయితే ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానమే మళ్లీ ‘బేబీ’సినిమాను గుర్తు చేస్తుంది. ప్రతాప్‌గా రవికృష్ణ బాగానే నటించాడు. ఫుల్‌ లెన్త్‌ రోల్‌ తనది. సంయుక్త మీనన్‌ ఒకే ఒక్క షాట్‌లో కనిపిస్తుంది. సిమ్రాన్ చౌదరితో పాటు మిగిలిన నటీనటుటు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా బాగుంది. ఎంఎం కీరవాణీ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్‌. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌
 

Rating:
Advertisement
 
Advertisement
 
Advertisement