
టైటిల్: లోపలికి రా చెప్తా
నటీనటులు: కొండా వెంకట రాజేంద్ర, మనీషా జష్ణాని, సుస్మిత ఆనాల, సాంచిరాయ్, అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి, వాణి ఐడా తదితరులు
నిర్మాతలు: లక్ష్మీ గణేష్ చేదెళ్ళ, కొండ వెంకట రాజేంద్ర
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొండా వెంకట రాజేంద్ర
సంగీతం: దేవ్ జాండ్
సినిమాటోగ్రఫీ:రేవంత్ లేవాక, అరవింద్ గణేష్
విడుదల తేది: జులై 5, 2025
కొండా వెంకట రాజేంద్ర కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం ‘లోపలికి రా చెప్తా’(Lopaliki Ra Chepta Review). మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరోయిన్లుగా నటించారు. లక్ష్మీ గణేశ్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నేడు(జులై 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
డెలివరీ బాయ్ రామ్ (కొండా వెంకట రాజేంద్ర), ప్రియ(సుస్మిత ఆనాల)కి పెళ్లి జరుగుతుంది. శోభనం రోజు గదిలోకి వెళ్లిన తర్వాత ప్రియ దెయ్యంలా మారి..రామ్ని భయపెట్టి, ముద్దు కూడా పెట్టుకోనియకుండా బయటకు పంపుతుంది. స్నేహితుడు ఇచ్చిన సలహాతో చేతికి తాయత్తు కట్టుకొని వెళితే.. రెండో రాత్రి కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుంది. దీంతో ఓ మంత్రగాడి(వంశీ) దగ్గరకు వెళ్తారు. ఆ మంత్రగాడు రామ్ నేపథ్యం గురించి అడగడంతో కథ ప్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది.
డెలివరీ బాయ్ రామ్‌కి రోడ్డుపై ఓ అమ్మాయి(సాంచిరాయ్) పరిచయం అవుతుంది. ఆమెనే నెంబర్ ఇచ్చి.. రాత్రికి తన అపార్ట్మెంట్కి రమ్మని కబురు పంపుతుంది. అక్కడి వెళ్లిన రామ్.. విల్లా నెంబర్ తప్పుగా చెప్పి లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విల్లా నెంబర్ 91లో ఉన్నది ఎవరు? నైనిక (మనీషా జష్ణాని) ఎవరు? ఆమెతో రామ్‌కి ఉన్న సంబంధం ఏంటి? విక్కీ(అజయ్ కార్తిక్) ఎవరు? రామ్ ఫస్ట్ నైట్ జరగకుండా అడ్డుకుంటున్న దెయ్యం ఎవరు? దాని కోరిక ఏంటి? చివరకు రామ్ శోభనం జరిగిందా లేదా? అనేదే మిగతా కథ.(Lopaliki Ra Chepta Review)
ఎలా ఉందంటే..
హారర్ కామెడీ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఇప్పటికే పదుల సంఖ్యలు ఈ జానర్‌లో చిత్రాలు వచ్చాయి. లోపలికి రా చెప్తా కూడా ఆ కోవలోకి చెందిన సినిమానే. హారర్ కామెడీకి రొమాన్స్‌ని యాడ్ చేసి యూత్‌పుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కొండా వెంకట రాజేంద్ర. హారర్ కంటే ఎక్కువ కామెడీ, రొమాంటిక్ సీన్లపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. అవి బాగా వర్కౌట్ అయ్యాయి.
ఫస్ట్‌నైట్ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. భార్య వింతగా ప్రవర్తిండంతో కథ హారర్ జోన్‌లోకి వెళ్తుంది. అయితే దర్శకుడు అక్కడ కూడా ఎక్కువగా భయపెట్టకుండా..కామెడీపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు. మంత్రగాడి దగ్గరకు వెళ్లడం.. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్‌గానే ఉంటాయి. ప్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తికరంగా సాగుతుంది. అమ్మాయి నెంబర్ ఇవ్వడం.. అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లడం.. ఇద్దరి మధ్య రొమాన్స్.. ఇవన్నీ యూత్‌ని ఆకట్టుకుంటాయి. నైనిక ఎపిసోడ్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్‌ని బాగా ప్లాన్ చేశారు.
ఇక సెకండాఫ్ మొత్తం దెయ్యం చుట్టునే కథనం తిరుతుంది. దెయ్యంతో శోభనం సీన్ నవ్వులు పూయిస్తుంది. ఓ మంచి సందేశంతో సినిమా ముగుస్తుంది. ప్రతి పది నిమిషాలకు ఒక రొమాంటిక్ సీన్ లేదా పాటనో పెట్టి బోర్ కొట్టకుండా చేశాడు. అయితే కొన్ని చోట్ల మోతాదుకు మించిన రొమాన్స్ ఉండడం, డబుల్ మీనింగ్ పాట ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. యూత్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ‘లోపలికి రా చెప్తా’ కోసం థియేటర్ లోపలికి వెళితే.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం గ్యారెంటీ.
ఈ సినిమాకు కొండా వెంకట రాజేంద్ర దర్శకత్వం వహించడంతో పాటు హీరోగాను నటించాడు. రెండింటికి తగిన న్యాయం చేశాడు. తెరపై చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. నైనిక పాత్రలో నటించిన మనీషా జష్ణాని తెరపై కావాల్సినంత అందాలను ప్రదర్శించింది. ఎమోషనల్ సీన్లలో చక్కగానే నటించింది. ఇక దెయ్యం పట్టిన భార్య ప్రియగా సుస్మిత ఉన్నంతలో బాగానే చేసింది. అయితే హారర్ సీన్లను బలంగా రాసుకోలేకపోవడంతో..ఆమె భయపెట్టిన ప్రతిసారి థియేటర్స్‌లో నవ్వులే పూసాయి తప్ప భయం పుట్టలేదు. సాంచిరాయ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. ‘టిక్ టాక్ చేద్దామా’ పాటలో అందాలను ఆరబోసి యూత్‌ని ఆకట్టుకుంది. అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి, వాణి ఐడాతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. దేవ్ జాండ్ సంగీతం బాగుంది. టిక్ టాక్ చేద్దామా పాట యూత్‌ని ఆకట్టుకునేలా ఉంటుంది. అలాగే సుదిలోనా దారం పాట థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. బీజీఎం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.