
నటుడు, బీజేపీకి చెందిన రంజిత్ శనివారం తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై విమర్శల దాడి చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మధురైలో జరిగిన మహానాడు సదస్సులో తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రిని మిస్టర్ అని సంబోధించడంతో పాటూ చిటికెలు వేస్తూ మాట్లాడారు. దీంతో విజయ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఈనేపథ్యంలో కోయంబత్తూర్, తుడియలూర్ ప్రాంతంలో జరిగిన వినాయక చతుర్థి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ విజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దేశ ప్రధానమంత్రినే చిటికెలు వేస్తూ విమర్శలు చేస్తావా?, తాను విజయన్‌ను నేరుగా కలిస్తే ముఖం బద్దలు కొడతాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఆదివారం ఉదయం తమిళగ వెట్రి కళగం పార్టీ నిర్వాహకులు తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, నటుడు రంజిత్ పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆన్‌లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది.
రంజిత్ తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా మాత్రమే కాకుండా, దర్శకుడిగా కూడా పనిచేశాడు. ఆయన నటనతో పాటు కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి, తనదైన శైలిని చూపించాడు. అయితే, తెలుగులో చిరంజీవి స్నేహంకోసం చిత్రంలో రంజిత్ కీలక పాత్రలో కనిపించారు.