‘తు మిల్ జాయే’ అంటూ లవ్‌సాంగ్ వినిపించారు షారుక్ ఖాన్ . ‘పఠాన్ ’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో షారుక్ ఖాన్ , దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో రూపొందుతోన్న హిందీ సినిమా ‘కింగ్’. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ , సుహానా ఖాన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సోమవారం (నవంబరు 2)న షారుక్ బర్త్ డే.
ఈ సందర్భంగా ‘కింగ్’ సినిమా నుంచి ‘తు మిల్ జాయే..’ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. సచిన్–జిగర్ ద్వయం స్వర పరచిన ఈ పాటకు కుమార్ సాహిత్యం అందించగా, అరిజిత్ సింగ్, మధుబంతి బాగ్చి పాడారు. పీయూష్–షాజియా కొరియోగ్రఫీ చేశారు. ఎడ్ షీరన్ ఈ పాటలోని ఇంగ్లీష్ ర్యాప్‌ను పాడారు. ‘నేను హంతకుడిని కాదు.. ప్రేమికుడిని. నా గురి నా ప్రేయసి గుండెపైనే. గుండెను చీల్చలేనివాడు అసలు ప్రేమికుడే కాదు’, ‘ఈసారి గుండెలో మంట మొదలైంది.. ఇప్పుడు ప్రపంచాన్ని తగలబెట్టే వరకు అది ఆగదు’ అని అర్థం వచ్చే డైలాగ్స్ కూడా ఈ పాటలో ఉన్నాయి.
‘‘కింగ్’ సినిమాలో షారుక్ పాత్రలోని మరో కొత్త కోణాన్ని ఈ పాట ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. సినిమా కథ, హీరో క్యారెక్టర్‌లోని డిఫరెంట్ షేడ్స్ ఎలా ఉండబోతున్నాయో కూడా ఈ పాటతో తెలుస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్ మెంట్, మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ పతాకాలపై గౌరీఖాన్ , మమతా ఆనంద్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 24న రిలీజ్ కానుంది.
∙షారుక్ ఖాన్, దీపిక


