రణ్‌బీర్‌కు కత్రీనాను పరిచయం చేసిందే దీపిక పడుకోణ్..

Katrina Kaif And Ranbir Kapoor Breakup Story In Telugu - Sakshi

‘అజబ్‌ ప్రేమ్‌ కీ గజబ్‌ కహానీ’..మొహబ్బతే

Karina Kapoor-Ranbir Kapoor Breakup: ‘అవును.. మోసం చేశాను. అవగాహన, అనుభవరాహిత్యం, నా మీద నాకున్న అతివిశ్వాసం, నా మొండితనం వల్ల అవతలి వ్యక్తిని టేకెన్‌ ఫర్‌ గ్రాంటెడ్‌గా తీసుకున్నాను. అనుభవం నేర్పిన పాఠంతో రిలేషన్‌షిప్‌ విలువ అర్థమైంది’ అని చెప్పాడు రణ్‌బీర్‌ కపూర్‌.. దీపిక పడుకోణ్‌తో బ్రేకప్‌ అయ్యాక చాలా రోజులకు. 

ఆనాటికి అతను కత్రీనా ప్రేమలో ఉన్నాడు.  ఈ ఇద్దరినీ ఒకరినొకరికి పరిచయం చేసింది ఎవరో తెలుసా? దీపిక పడుకోణ్‌. సందర్భం.. కత్రీనా కైఫ్‌ బర్త్‌డే పార్టీ. ఆ సమయంలో కత్రీనా ..సల్మాన్‌ఖాన్‌ ప్రేమలో ఉంది. దీపిక, కత్రీనా ఇద్దరూ మంచి స్నేహితులు. 2008లో తన పుట్టిన రోజు వేడుకకు దీపికాను ఆహ్వానించింది కత్రీనా. అప్పటికి దీపిక, రణ్‌బీర్‌లు డేటింగ్‌లో ఉన్నారు. ఆ పార్టీకి అతణ్ణి వెంటబెట్టుకెళ్లి.. కత్రీనాకు పరిచయం చేసింది దీపిక. అలా రణ్‌బీర్, కత్రీనాలు ఫ్రెండ్స్‌ అయ్యారు.  

ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్‌
‘అజబ్‌ ప్రేమ్‌ కీ గజబ్‌ కహానీ’ విడుదలైంది. అందులో హీరోహీరోయిన్లు రణ్‌బీర్, కత్రీనాలే. ఆ సినిమాతో వాళ్ల ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. తెరబయటా సన్నిహితులైపోయారు. దీపికాతో రణ్‌బీర్‌కున్న అనుబంధం పలచనవసాగింది. ఇటు సల్మాన్‌తో కత్రీనా రిలేషన్‌ కూడా కొన ఊపిరితో ఉండింది.

న్యూయార్క్‌లో రణ్‌బీర్‌, కత్రినాల సెలబ్రేషన్స్‌
రణ్‌బీర్, కత్రీనాల తర్వాత సినిమా. ఆ సెట్స్‌మీదే ఆ జంట మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. అప్పటిదాకా వదంతులుగా ప్రచారమవుతున్న ఆ వ్యవహారం గురించి నమ్మడం మొదలుపెట్టారు ఇటు సినిమాభిమానులు.. అటు దీపిక, సల్మాన్‌లు. ఆనవాళ్లూ దొరికి ఆ బంధాన్ని బ్రేక్‌  చేసేసుకున్నారిద్దరూ. రాజ్‌నీతి పూర్తయ్యాక ఆ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కోసం న్యూ యార్క్‌ వెళ్లారు రణ్‌బీర్, కత్రినా. అక్కడ న్యూ ఇయర్‌ ఈవ్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నారు. కత్రీనా.. రణ్‌బీర్‌ కుటుంబానికి దగ్గరైంది. రణ్‌బీర్‌ కూడా కత్రీనా ఫ్యామిలీకి ఆప్తుడైపోయాడు.

కరీనా హింట్‌తో ఫిక్సయ్యారు
ఈ ఇద్దరూ స్పెయిన్‌లో హాలీడేస్‌ను స్పెండ్‌ చేశారు. అక్కడి సముద్రం ఒడ్డున వీళ్లు దిగిన ఫోటోలు ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అయ్యాయి. ఇంక ఈ జంట పెళ్లి పీటలెక్కడం ఖాయమనుకున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. దాన్ని బలరపరుస్తున్నట్టుగా కాఫీ విత్‌ కరణ్‌ షోలో ‘రణ్‌బీర్, కత్రీనా పెళ్లిలో చిక్‌నీ చమేలీ (అగ్నీపథ్‌ సినిమాలోని ఈ స్పెషల్‌ సాంగ్‌ను కత్రీనా మీద చిత్రీకరించారు) పాట మీద డాన్స్‌ చేయాలనుకుంటున్నాను’  అని చెప్పింది కరీనా.

ఇంటర్వ్యూల్లో ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు
ఆ జంట కూడా తమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచే ప్రయత్నం చేయలేదు. డే అవుట్‌లు, వీకెండ్‌ హ్యాంగవుట్లతో పాపరాజీకి కావలసినంత ఫుటేజీ ఇచ్చారు. బాలీవుడ్‌ ఫంక్షన్లకూ కలిసే వెళ్లి కనువిందు చేశారు. అంతేకాదు.. ‘రణ్‌బీర్‌ అద్భుతమైన నటుడే కాదు అత్యద్భుతమైన వ్యక్తి కూడా. నా జీవితంలో అతను ప్రత్యేకం. తను నాకెంత దగ్గరివాడో ఈపాటికి అందరూ గమనించే ఉంటారు’ అంటూ కత్రీనా.. ‘నా లైఫ్‌లో కత్రీనాది స్పెషల్‌ ప్లేస్‌. నా కుటుంబం, ఆప్తుల వరుసలో తను ముందుంటుంది’అంటూ రణ్‌బీర్‌ మీడియా ఇంటర్వ్యూలలో ఒకరి మీద ఒకరికున్న ప్రేమాభిమానాలను పంచుకున్నారు. 

సహజీవనం..నిశ్చితార్థం కూడా...
వాళ్ల ప్రేమ కచ్చితంగా పెళ్లిగా మారుతుందనే నమ్మకానికి ఇంకో కారణం.. ఆ ఇద్దరూ  కొత్త ఫ్లాట్‌లోకి మారి  సహజీవనమూ ప్రారంభించడం. లండన్‌లో ఆ జంటకు ఇరు కుటుంబాల ఆధ్వర్యంలో నిశ్చితార్థం జరిగిందనే వదంతీ వినిపించింది. రేపేమాపో వివాహ ఆహ్వాన∙పత్రిక రావొచ్చనీ ఎదురు చూడసాగారు ఆ జంట సన్నిహితులు.  ‘ఈ ఏడాది (2015) ఇద్దరం బిజీయే.. పెళ్లి ఆలోచన కూడా రానంతగా. వచ్చే ఏడు ప్లాన్‌ చేసుకుంటున్నాం’ అని చెప్పాడు రణ్‌బీర్‌ కపూర్‌.. ఆనంద్‌ బజార్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.  

రణ్‌బీర్‌ లైఫ్‌లోకి ఆలియా ఎంట్రీ
ఆ ప్రేమా పెళ్లిదాకా రాలేదు. ఇద్దరూ విడిపోయారు. అలియా భట్‌తో రణ్‌బీర్‌కు కుదిరిన స్నేహమే కత్రీనాతో బ్రేకప్‌కి కారణం అంటారు రణ్‌బీర్‌ ఫ్రెండ్స్‌.  ‘జగ్గా జాసూస్‌’  ప్రారంభమయ్యాక వీళ్ల మధ్య పొరపొచ్చాలు పొడచూపాయి. ఆ సినిమా నిర్మాతల్లో కత్రీనా కైఫ్‌ ఒకరు. షూటింగ్‌లో  ఈ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారని వినికిడి. 

అయితే..వాళ్ల బ్రేకప్‌ నేపథ్యంలో మీడియాకు ఇచ్చిన  ఒక ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ ‘మేమిద్దరం విడిపోయామంటూ  వస్తున్న వార్తలన్నీ మీడియా ఊహగానాలే. మా మధ్య ఎలాంటి స్పర్థలు లేవు.  నన్ను చాలా ప్రభావితం చేసిన వ్యక్తి కత్రీనా. ఆమెతోనే జీవితాన్ని పంచుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో తనను మిస్‌ చేసుకోను. ఐ నీడ్‌ హర్‌ ఇన్‌ మై లైఫ్‌’ అని చెప్పాడు. అది ఒట్టి అబద్ధమని ఆ వెంటనే తేలిపోయింది. ‘ప్రాణంగా ప్రేమించి వ్యక్తి నుంచి విడివడి.. నేనుగా నిలబడ్డానికి.. చాలా కష్టపడ్డాను. అస్పష్టతను మించిన నరకం ఉండదు’ అని చెప్పింది కత్రీనా కైఫ్‌.. జగ్గా జాసూస్‌ సినిమా విడుదల తర్వాత ఒక ఇంటర్వ్యూలో. 
∙ఎస్సార్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top