ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14 అయినప్పటికీ వారం రోజుల ముందే సందడి మొదలవుతుంది. రోజ్‌డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే.. అంటూ ఫిబ్రవరి 7 నుంచే రోజుకో రకమైన సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అలా ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే. ఈ క్రమంలో బాలీవుడ్ జంట కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ తమలో ఎవరు ముందుకుగా ప్రపోజ్ చేశారో వెల్లడించారు.
నగలు బహుమతి
వీరిద్దరూ జంటగా వోగ్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కరీనా కపూర్ మాట్లాడుతూ నా బర్త్‌డే, పెళ్లిరోజుకు సైఫ్ జ్యువెలరీ గిఫ్ట్‌గా ఇస్తుంటాడు అంది. ఇంతలో సైఫ్ కలగజేసుకుంటూ ఏదైనా గొప్ప విజయం సాధించినప్పుడు కూడా తనకు బహుమతులిస్తుంటాను అని చెప్పాడు.
నాకైతే గుర్తు లేదు
ఐ లవ్యూ ఎవరు ముందుగా చెప్పారన్న ప్రశ్నకు.. కరీనా అది నేనే అయ్యుంటుంది. అతడు నన్ను ఇబ్బంది పెట్టకూడదనే చూస్తాడు. కాబట్టి నేనే సాహసం చేసి చెప్పుంటాను అంది. అందుకు సైఫ్.. ఇది నిజంగా బాగుంది, నాకైతే ఎవరు ముందు ప్రపోజ్ చేశారన్న విషయం అసలు గుర్తేలేదు అన్నాడు.
పెళ్లి
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ 2008లో వచ్చిన తషాన్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారులు తైమూర్, జే సంతానం. కాగా సైఫ్ అలీ ఖాన్‌కు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. గతంలో సైఫ్.. అమృత సింగ్‌ను పెళ్లి చేసుకోగా వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జన్మించారు. ఈ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2004లో విడిపోయారు.


