
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్‌కు ముందు కష్టాలు తప్పేలా లేవు. ఈ మూవీకి సంబంధించిన కీలకమైన హార్డ్ డిస్క్ చోరీకి గురి కావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ వివాదంపై నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సైతం ఓ లేఖను విడుదల చేసింది. మూడు నెలల క్రితమే హార్డ్ డ్రైవ్ పోయినట్లు నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
తమ సినిమా హార్డ్ డ్రైవ్ కోసం ముంబయి కంపెనీని నిర్మాత సంప్రదించారు. అయితే తాము మార్చి మొదటి వారంలోనే హైదరాబాద్‌కు డ్రైవ్ పంపించామని కంపెనీ ప్రతినిధులు ఆయనతో అన్నారు. కొరియర్ ద్వారా హార్డ్ డ్రైవ్ పంపిస్తే రఘు డెలివరీ తీసుకున్నారని సదరు కంపెనీ తెలిపింది. అయితే తానేలాంటి డ్రైవ్ తీసుకోలేదని రఘు నిర్మాతతో అన్నారు.
దీంతో వెంటనే హార్డ్ డిస్క్ మిస్సింగ్ కావడంపై నిర్మాత పోలీసులను ఆశ్రయించారు. అందులో అత్యంత కీలకమైన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఫైల్స్ మొత్తం ఉన్నాయని తెలిపారు. ఆ డ్రైవ్ మిస్సయితే కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అన్నారు. సినిమా విడుదల కంటే ముందు ఏదైనా బయటికి వస్తే పెద్ద నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతతో పాటు పలువురి దగ్గర నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ తీసుకున్నారు.