వైజాగ్‌పై కమల్‌ వ్యాఖ్యలు.. 'ఓజీ'లో శింబు పాట | Kamal Haasan Comment On VISAKHAPATNAM And Actor Simbu With OG Movie | Sakshi
Sakshi News home page

వైజాగ్‌పై కమల్‌ వ్యాఖ్యలు.. 'ఓజీ'లో శింబు పాట

May 30 2025 10:51 AM | Updated on May 30 2025 11:08 AM

Kamal Haasan Comment On VISAKHAPATNAM And Actor Simbu With OG Movie

‘థగ్‌ లైఫ్‌’ ఒక అద్భుతమైన సినిమా అని హీరో కమల్‌ హాసన్‌ అన్నారు.‍ తాజాగా విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో  చిత్ర యూనిట్‌ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా కమల్‌హాసన్‌ మాట్లాడుతూ.. వైజాగ్‌ తనను ఎంతో ఆదరించిందన్నారు. 21 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చిన తనకు ‘మరో చరిత్ర’చిత్రం తిరుగులేని అభిమానగణాన్ని అందించిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ‘ఏక్‌ దుజే కేలియే’ చిత్రం హిందీలో విజయం సాధించినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతోగానో ఆనందించారన్నారు. ‘సాగర సంగమం’, ‘ఏక్‌ దుజే కేలియే’, ‘శుభసంకల్పం’వంటి చిత్రాలు షూటింగ్‌లు ఇక్కడే జరిగాయని, ఇది తన సొంత ఇల్లు లాంటిదని ఆయన పేర్కొన్నారు. 

మంచి కళ ఎక్కడ కనిపించినా తాను సెల్యూట్‌ చేస్తానని, అందులో ఎన్నో విషయాలు నేర్చుకుంటానని కమల్‌ అన్నారు. తాను కొన్ని చెడు సినిమాలు కూడా చేశానని, వాటిని ప్రేక్షకులు మరిచిపోయి కేవలం మంచి చిత్రాలనే గుర్తు పెట్టుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. మంచి సినిమాలు అందించడం తన బాధ్యత అని అన్నారు. తాను నటించిన 15 తెలుగు చిత్రాల్లో 13 విజయవంతం అయ్యాయని, ఆ విజయాలన్నీ ప్రేక్షకుల వల్లే సాధ్యమయ్యాయని చెప్పారు. ప్లాప్‌లు మాత్రమే తన ఖాతాలో వేసుకుంటానన్నారు. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి ‘థగ్‌ లైఫ్‌’చిత్రాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.

 ‘థగ్‌ లైఫ్‌’ చాలా గొప్ప చిత్రమని, శింబు అద్భుతమైన నటన కనబరిచారని, ఇది వరకు చూడని పాత్రలో ఆయన కనిపిస్తారని కొనియాడారు. అభిరామి కూడా అద్భుతంగా నటించారని, నాజర్‌తో తనది చాలా కాలం నుంచి ప్రయాణమన్నారు. త్రిష నటన ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని, తామంతా కలిసి ఒక గొప్ప సినిమా చేశామని నమ్ముతున్నట్లు చెప్పారు. జూన్‌ 5న తాము అనుకున్నది కరెక్టో కాదో ప్రేక్షకులు సినిమా చూసి చెప్పాలని కోరారు.

ఓజీ సినిమాలో పాట పాడాను..
హీరో శింబు మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తారని, ఈ చిత్రం కూడా తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఓజీ’ సినిమాలో తాను ఒక పాట పాడానని, అది త్వరలోనే విడుదల కానుందని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం కూడా త్వరలో విడుదల కానుందని, ఆ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హీరోయిన్‌ త్రిష మాట్లాడుతూ ‘వర్షం’ సినిమా విడుదలై 22 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇప్పటికీ ఇంత అభిమానం చూపిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. వైజాగ్‌ తనకెంతో ఇష్టమైన నగరమని, ‘థగ్‌ లైఫ్‌’సినిమాలో కమల్‌ హాసన్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తాను ఇంద్రాణి అనే పాత్ర పోషించానని, ఆ పాత్ర తప్పకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోతుందన్నారు. అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో సినిమా బృందానికి అభిమానులు ఘన స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement