దాదా సాహెబ్‌ ఫాల్కే గెటప్‌లో ఎన్టీయార్‌ స్టిల్స్ బయటకు... | Jr NTR To Play Dadasaheb Phalke In Made In India, AI Generated Images Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

దాదా సాహెబ్‌ ఫాల్కే గెటప్‌లో ఎన్టీయార్‌ స్టిల్స్ బయటకు...

May 17 2025 11:27 AM | Updated on May 17 2025 1:21 PM

Jr NTR To Play Dadasaheb Phalke In Made In India, AI Generated Images Goes Viral

దర్శక దిగ్గజం ఎస్‌.ఎస్‌. రాజమౌళి అనే పేరు సెన్సేషన్‌ అనే పదం రెండూ చెట్టాపట్టాలేసుకుని పక్కపక్కనే నడుస్తుంటాయి. ప్రస్తుతం మహేష్‌బాబుతో సినిమాకు సంబంధించి ఒక్క వార్తా బయటకు రాకుండా సినీ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఈ సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌... ఇటీవలే తాను తీయబోయే మహాభారతం సినిమా గురించి ఓ అప్‌డేట్‌గా హీరో నాని కి పాత్ర ఇవ్వనున్నట్టు చెప్పి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఇప్పుడు మరోసారి ఆయన అంతకు మించిన సంచలనాన్ని సృష్టించారు. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ ను సినిమాగా సమర్పించబోతున్నానని  ప్రకటించారు.

అంతేకాదు ఆయన చేసిన ప్రకటనను బట్టి చూస్తుంటే ఆ సినిమాలో కధానాయకుడి  పాత్రను జూ.ఎన్టీయార్‌ పోషించబోతున్నారని దాదాపుగా రూఢీ అయింది. నిజానికి ఇది ఆయన రెండేళ్ల నాడే చెప్పిందే అయినప్పటికీ... ముడి సరకు అంతా రెడీ అయిపోయింది... ఇక షూటింగ్‌ పట్టాలెక్కబోతోంది అని ఆయన ప్రకటనతో తేలిపోయింది.

తాజాగా ఆయన చేసిన పోస్ట్‌ ఇలా  ఉంది..‘‘నేను మొదటిసారి కథ విన్నప్పుడు, అది నన్ను మరేదీ లేని విధంగా భావోద్వేగపరంగా కదిలించింది. బయోపిక్‌ను సినిమాగా తీయడం చాలా కష్టం,  ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా గురించి ఊహించడం మరింత సవాలుతో కూడుకున్నది. అయితే మా అబ్బాయిలు దానికి సిద్ధంగా ఉన్నారు  సగర్వంగా, మేడ్‌ ఇన్‌ ఇండియాను ప్రజంట్‌ చేస్తున్నాను’’
రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రకటించి రెండు సంవత్సరాలు అయింది. అప్పుడే ఈ చిత్రానికి మేడ్‌ ఇన్‌ ఇండియా అని పేరు పెట్టారు. ఇలా రాజమౌళి పోస్ట్‌ చేశారో లేదో... అలా ఈ పాత్రకు ఎన్టీయార్‌ పోషించబోతున్నారని వార్తలు వ్యాపించాయో లేదో... అంతే... ఆధునిక సాంకేతిక యుగపు నిపుణులు తమ టాలెంట్‌కు పదును పెట్టారు.

దాదా సాహెబ్‌ ఫాల్కే పాత్రలో యంగ్‌ టైగర్‌ ఎలా ఉంటాడు అనేదానిపై తమ ఊహలకు  రూపాల్ని ఇస్తున్నారు. వారికి అత్యాధునిక ఏఐ వంటి టెక్నాలజీలు తోడయ్యాయి.  దాంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ దాదా గెటప్‌ చిత్రాలు ఇంటర్నెట్‌లో తుఫానుగా మారాయి,  ఏఐ రూపొందించిన ఈ చిత్రాలలో జూనియర్‌ ఎన్టీఆర్‌ దాదాసాహెబ్‌ ఫాల్కే పాత్రలో ఇమిడిపోయినట్టు కనిపిస్తున్నాడు,  ఖాదీ కుర్తా ధరించి, కళ్ళద్దాలు  గడ్డం తో ఆకట్టుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని వరుణ్‌ గుప్తా (మాక్స్‌ స్టూడియోస్‌)  ఎస్‌ఎస్‌ కార్తికేయ (షోయింగ్‌ బిజినెస్‌) నిర్మిస్తారు. నిర్మాతలు స్క్రిప్ట్‌ పై పనిలో బిజీగా ఉన్నారు మరియు తుది డ్రాఫ్ట్‌ను పూర్తి చేస్తున్నారు.
ఓ రకంగా ఇది భారతీయ సినిమా కధ అని చెప్పొచ్చేమో... ఎందుకంటే.. ఈ సినిమా కథాంశం భారతీయ సినిమా పుట్టుక  పెరుగుదలకు అద్దం పట్టనుంది. మరోవైపు మేడ్‌ ఇన్‌ ఇండియా సినిమా జూనియర్‌ ఎన్టీఆర్‌కు యాక్షన్‌ చిత్రాల నుంచి ఒక్కసారిగా రిఫ్రెషింగ్‌ బ్రేక్‌ అవుతుంది అనేది నిర్వివాదం.


ఇదిలా ఉంటే.. అటు బాలీవుడ్‌లోనూ ఆమిర్‌ఖాన్‌ - రాజ్‌కుమార్‌ హిరాణీ కలయికలో    ఈ బయోపిక్‌ రూపొందుతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై దాదాసాహెబ్‌ ఫాల్కే మనవడు చంద్రశేఖర్‌ శ్రీకృష్ణ స్పందిస్తూ.. రాజమౌళి సమర్పణలో ఈ ప్రాజెక్ట్‌ వస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ.. ఆయన టీమ్‌ ఇంతవరకు నన్ను సంప్రదించలేదు. కానీ ఆమిర్‌-రాజ్‌ కుమార్‌ హిరానీ టీమ్‌ మూడేళ్లుగా నాతో టచ్‌లో ఉన్నారు’ అని చెప్పారు. మరి రాజమౌళి సినిమా ఉంటుందో లేదో తెలియదు కానీ ఎన్టీఆర్‌ ఏఐ ఫోటోలు అయితే నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement