
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మోహన్ బాబు, ప్రియమణి, మమత మోహన్‌దాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఐకానిక్ సోషియో ఫాంటసీ చిత్రం ‘యమదొంగ’(Yamadonga) బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ఈ చిత్రాన్ని మే 18 నుంచి రీ రిలీజ్ చేయనున్నారు.
రీ రిలీజ్ కోసం టీం అమితంగా శ్రమించినట్లు తెలుస్తోంది. ‘యమదొంగ’ను 8Kలో స్కాన్ చేసి, 4K నాణ్యతకు కుదించి, అసాధారణమైన దృశ్య అనుభవాన్ని అందించేలా సిద్ధం చేశారు. ఈ అత్యాధునిక టెక్నాలజీతో అభిమానులు సినిమాను మరింత ఉన్నత నాణ్యతలో ఆస్వాదించవచ్చు.
సోషల్ మీడియాలో ‘యమదొంగ’ రీ రిలీజ్ సందడి జోరుగా సాగుతోంది. ప్రధాన నటీమణులు ప్రియమణి, మమత మోహన్‌దాస్ షూటింగ్ రోజుల జ్ఞాపకాలను పంచుకుంటూ విడుదల చేసిన వీడియోలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాజమౌళి దర్శకత్వ విజన్, ఎంఎం కీరవాణి సంగీతంతో ‘యమదొంగ’ మరోసారి తెరపై సందడి చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.