
– ‘ఇరుంబు కై మాయావి’ కథలో మార్పులు
వెండితెరపై సూపర్ హీరో చేసే విన్యాసాలు పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చుతాయి. ఇక ఆమిర్ ఖాన్‌లాంటి హీరో సూపర్ హీరోగా కనిపిస్తే... ఆ చిత్రానికి ఎనలేని క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజీ ప్రాజెక్ట్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆమిర్‌ని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సూపర్ హీరోగా చూపించనున్న సంగతి తెలిసిందే.
నిజానికి సూర్య హీరోగా ‘ఇరుంబు కై మాయావి’ (ఇనుప చేయి మాయగాడు) టైటిల్‌తో చేయాల్సిన కథని ఇప్పుడు ఆమిర్‌తో తీయనున్నారు లోకేశ్. అయితే నాలుగైదేళ్ల క్రితం లోకేశ్ ఈ కథ రాసుకున్నారు. ఆ తర్వాత తాను తెరకెక్కించిన చిత్రాల్లో ఈ స్క్రిప్ట్‌లోని కొన్ని సన్నివేశాలను కూడా ఉపయోగించారు. అలానే వేరే చిత్రాల్లోనూ ఈ కథలోని కొన్ని సన్నివేశాలు పోలినవి ఉన్నాయట. సో... ఈ స్క్రిప్ట్‌ని రీ వర్క్ చేస్తున్నారట లోకేశ్. ముందు అనుకున్నట్లుగానే సూపర్ హీరో మూవీలానే తెరకెక్కిస్తారు. అయితే ముందు అనుకున్న కథలో హీరోకి ఒక చేయి ఉండదు.
దాంతో ఇనప చేయి పెట్టించుకుంటాడు. ఆ మెటల్ హ్యాండ్‌తో ఈ సూపర్ హీరో చేసే విన్యాసాలు మామూలుగా ఉండవట. ముందు అనుకున్న కథ ఇది. మరి... ఇప్పుడు కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారు కాబట్టి... ఈ కథలో సూపర్ హీరో ఆమిర్ ఖాన్‌కి చేయి ఉంటుందా? లేకపోతే ఇరుంబు కై (ఇనుప చేయి)తో ఈ హీరో ఎలాంటి విన్యాసాలు చేయనున్నారనేది చూడాలి. ఈ కథ మీద వర్క్ చేస్తూనే మరోవైపు కార్తీ హీరోగా ‘ఖైదీ’ సీక్వెల్‌ని తెరకెక్కిస్తారు లోకేశ్. ఇక రజనీకాంత్ హీరోగా లోకేశ్ దర్శకత్వం వహించిన ‘కూలీ’ చిత్రంలో ఆమిర్ ఖాన్ ఓ కీ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.