
క్యాన్సర్ వచ్చిందని కుంగిపోకుండా ధైర్యంగా దాన్ని జయించానంటోంది మలయాళ నటి, యాంకర్ జ్యువెల్ మేరీ (Jewel Mary). 2023లో ఈమె థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడింది. ఓపక్క అనారోగ్యం, మరోపక్క కుటుంబంలో కలహాలు.. అన్నింటినీ మౌనంగా భరించింది. గతేడాది భర్తకు విడాకులిచ్చింది. తాజాగా తన ప్రయాణాన్ని ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. 2023లో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడైతే దాన్ని జయించి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. మళ్లీ క్యాన్సర్ వస్తుందేమోనన్న భయమైతే నాకు లేదు. ఈరోజును ఆస్వాదించడమే నాకు తెలుసు.
గతేడాది విడాకులు
నాకు జేన్సన్ జచరయ్య (నిర్మాత)తో పెళ్లయింది. తర్వాత విడాకులు కూడా అయ్యాయి. విడాకులు చాలా ఈజీ అని అందరూ అంటుంటారు. కానీ నా విషయంలో అలా జరగలేదు. చాలా పోరాడాల్సి వచ్చింది. 2021 నుంచి మేమిద్దరం విడివిడిగా జీవిస్తున్నాం. మూడేళ్లు పోరాడితే.. గతేడాది నాకు విడాకులు మంజూరయ్యాయి. ఆ మధ్యకాలంలో లండన్‌లో నాకు ఓ షో ఉంటే వెళ్లాను. పనిలో పనిగా ఇంగ్లాండ్ అంతా చుట్టేస్తూ పాత స్నేహితులను కలిశాను.

హెల్త్ చెకప్‌కు వెళ్తే..
తర్వాత ఐర్లాండ్, స్కాట్‌లాండ్ వెళ్లాను. ఒంటరిగానే వెకేషన్ పూర్తి చేశాను. టూర్ అయిపోయాక కొచ్చికి వచ్చేశాను. అయితే నాకు ఏడెనిమిదేళ్లుగా థైరాయిడ్ ఉంది. దాంతో ఒకసారి చెకప్‌కు వెళ్దామనుకున్నాను. డాక్టర్ నన్ను చూసి స్కానింగ్ చేయించుకోమన్నాడు. స్కానింగ్ అయ్యాక అందరూ ఏదో గుసగులాడుతున్నారు. నేను బీఎస్సీ నర్సింగ్ చదివాను కాబట్టి స్కానింగ్ చూశాక ఏదో కరెక్ట్‌గా లేదన్న విషయం అర్థమైంది. డాక్టర్ బయాప్సీ చేయాలన్నారు. నేను వద్దంటున్నా సరే ఆయన బయాప్సీ చేయించారు.
ఏడుగంటల సర్జరీ
అప్పటికే నేను భయంతో వణికిపోతున్నాను. 15 రోజులకు బయాప్సీ రిపోర్ట్ వచ్చింది. అది చూశాక ఎందుకైనా మంచిదని మరోసారి బయాప్సీ చేద్దామన్నారు. రెండు రిపోర్ట్స్‌లోనూ నాకు థైరాయిడ్ క్యాన్సర్ అని తేలింది. ఏడుగంటలపాటు సర్జరీ చేసి క్యాన్సర్ గడ్డను తొలగించారు. సర్జరీ తర్వాత నా కుడిచేయి సరిగా పనిచేయలేదు, మాట పెగల్లేదు. యాంకర్‌గా మాట్లాడటం, పాడటం.. అన్నీ చేయాలి. అలాంటిది గొంతు మూగబోయిందంటే నేను ఉన్నా లేనట్లే!
మూగబోయిన గొంతు..
కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే ఏదీ మారదు. నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. నా కోసం ఉన్నది నేను మాత్రమే! అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. వాయిస్ థెరపీ ద్వారా నా గొంతు నాకు తిరిగొచ్చింది. ఫిజియో థెరపీ వల్ల చేయి కూడా మామూలైపోయింది. ఆరు నెలల్లో అంతా సర్దుకుంది. 2024లో క్యాన్సర్‌ను జయించాను, విడాకులు తీసుకున్నాను. అన్నింటినీ దాటుకుని ఇక్కడ నిలబడ్డాను అని చెప్పుకొచ్చింది. జ్యువెల్ మేరీ ఆంటోని, క్షణికం, గెట్ సెట్ బేబీ వంటి మలయాళ చిత్రాల్లో నటించింది. అన్నాదురై, మామనితన్ వంటి తమిళ సినిమాల్లోనూ కనిపించింది.
చదవండి: నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. బోరుమని ఏడ్చేసిన సదా