మహేశ్‌ బాబాయ్‌ ఆ మాట చెప్పాడు.. ప్లాన్‌ ‘బి’ లేదు : జయకృష్ణ | Jayakrishna Ghattamaneni Shares Interesting Facts About His Film Journey And Krishna | Sakshi
Sakshi News home page

మా తాతగారు ఇచ్చిన పెద్ద గిఫ్ట్‌ అదే: ఘట్టమనేని జయకృష్ణ

Jun 28 2026 8:48 AM | Updated on Jun 28 2026 10:57 AM

Jayakrishna Ghattamaneni Shares Interesting Facts About His Film Journey And Krishna

‘‘ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను’... ‘పోకిరి’లో మహేశ్‌బాబు చెప్పిన ఈ డైలాగ్‌ చాలా పాపులర్‌. మహేశ్‌బాబు అన్నయ్య రమేష్‌బాబు తనయుడు, సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని కూడా ఇదే తరహాలోనే అన్నారు. ‘‘ఒక్కసారి ఫిక్స్‌ అయితే హండ్రెడ్‌ పర్సెంట్‌ చేసేయాల్సిందే’’ అని ‘సాక్షి’తో మాట్లాడుతూ జయకృష్ణ పేర్కొన్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా జూలై 9న హీరోగా వెండితెరకు పరిచయం కానున్నారు జయకృష్ణ. ‘‘యాక్టర్‌ అవ్వాలని ఫిక్స్‌ అవ్వడం మాత్రమే కాదు... కెరీర్‌ కోసం ఎంత కష్టపడటానికైనా రెడీ’’ అంటూ... ఇంకా ‘సాక్షి’తో జయకృష్ణ ప్రత్యేకంగా చెప్పిన విశేషాలు...

చిన్నప్పుడు చబ్బీగా ఉండేవాణ్ణి: 
చిన్నప్పుడు నేను చబ్బీగా ఉండేవాణ్ణి. దాంతో ‘సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌’ ఉండేది కాదు. కానీ యాక్టర్‌ కావాలన్నది నా టార్గెట్‌. మా తాతయ్య చాలా ఎంకరేజ్‌ చేశారు. ‘నువ్వు యాక్ట్‌ చేయగలవు’ అన్నారు. ఆ మాటలు చాలా కాన్ఫిడెన్స్‌ ఇచ్చాయి. దగ్గర దగ్గర 120 కిలోల బరువు ఉండేవాణ్ణి. దాదాపు నలభై కేజీలు తగ్గాను. న్యూయార్క్, ముంబై వెళ్లి యాక్టింగ్‌లో ట్రైనింగ్‌ తీసుకున్నాను. ఒక కంప్లీట్‌ యాక్టర్‌కి ఏమేం కావాలో అవన్నీ నేర్చుకున్నాను.

ఫుడ్‌ లవర్‌ని: 
ఫుడ్‌ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అప్పట్లో అంత లావుగా ఉండేవాణ్ణి. యాక్టర్‌ అన్నాక అలా కుదరదు... చాలెంజ్‌గా తీసుకుని బాగా తగ్గాను. ఫుడ్‌ తినడం కూడా తగ్గించాను. ఇక్కడ నేను వెయిట్‌ ‘లాస్‌’ అయితే అక్కడ స్క్రీన్‌ మీద నాకు ‘గెయిన్‌’. అలా కెరీర్‌ కోసం ఏ త్యాగం అయినా చేసేస్తాను. 

ప్లాన్‌ బి లేదు:
కెరీర్‌ వైజ్‌గా ప్లాన్‌ ఎ, ప్లాన్‌ బి అని పెట్టుకోలేదు. యాక్టర్‌ అవ్వాలన్నది నా ప్లాన్‌ ఎ’. ఆ ఒక్కదానికే ఫిక్స్‌ అయ్యాను. అదే ప్లాన్‌ బి’ పెట్టుకున్నామనుకోండి అప్పుడు నా ప్లాన్‌ ఎ’ మీద నాకు నమ్మకం లేనట్లే. అలాగే నేనెప్పుడూ ‘హీరో’ అవ్వాలనుకోలేదు. ‘యాక్టర్‌’ అనేది నా టార్గెట్‌. అందుకే కథ, క్యారెక్టర్‌ నచ్చితే ఏ సినిమా అయినా చేసేస్తాను. ‘శ్రీనివాస మంగాపురం’ కోసం ఎంత కష్టపడాలో అంతా పడ్డాను.

సినిమా ముందు నాకేదైనా తక్కువే: 
‘గోల్డెన్‌ స్పూన్‌ కదా... ఏం కష్టపడతాడులే’ అని చాలామంది అనుకోవచ్చు. కానీ సినిమా ముందు నాకేదైనా తక్కువే. ‘శ్రీనివాస మంగాపురం’ కోసం 93 రోజులు వర్క్‌ చేశాం. కొన్ని సీన్స్‌ చేశాక ఇంటికెళ్లి, షవర్‌ ముందు నిలబడితే ఒంటి మీద పడిన నీళ్ల నుంచి బాగా మట్టి వచ్చేది. అలాంటి లొకేషన్స్‌లోనూ షూటింగ్‌ చేశాం. షూట్‌ నుంచి ఇంటికెళ్లాక ‘ఇవాళ నా పనిని వంద శాతం చేశాను’ అని ప్రశాంతంగా నిద్రపోవాలన్నది నా లక్ష్యం. 93 రోజులూ అలానే నిద్రపోయాను. డైరెక్టర్‌ అజయ్‌ భూపతిగారి స్క్రిప్ట్‌ ఎంత డిఫరెంట్‌గా ఉంటుందో తెలిసిందే. లవ్‌స్టోరీయే కదా... చాలెంజెస్‌ ఉండవని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఈ సినిమా స్టోరీలో చాలా సవాళ్లు ఉన్నాయి.

ఫిఫ్టీ ఫిఫ్టీ చేయకూడదని బాబాయ్‌ అన్నారు: 
నేను సినిమాల్లోకి వెళతాను అన్నప్పుడు మా మహేశ్‌ బాబాయ్‌ ‘ఏం చేసినా ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు... హండ్రెడ్‌ పర్సెంట్‌ చేయాలి’ అన్నారు. మా సినిమా అప్‌డేట్స్‌ తెలుసుకుంటూ, ఎంకరేజ్‌ చేశారు. గౌతమ్‌ (మహేశ్‌ కుమారుడు) కూడా సినిమాల్లోకి వస్తాడు. మీకు పోటీ ఉంటుందా? అంటే... అలా ఏం ఉండదు. ఎందుకంటే సినిమా అనేది చాలా పెద్దది. ఎవరైనా రావొచ్చు...  నిరూపించుకోవచ్చు. 

బాధను పంచుకోను:
ఎవరి లెవల్‌ కష్టాలు వాళ్లకు ఉంటాయి. నాకూ చిన్న అప్స్‌ అండ్‌ డౌన్స్‌ ఉంటాయి. డల్‌ మూమెంట్స్‌ ఉంటాయి. కానీ ఎవరితోనూ షేర్‌ చేసుకోను. అలాగని టెన్షన్‌ పడిపోను. ప్రతి విషయానికీ ఒక పరిష్కారం ఉంటుందని నమ్ముతాను. మనిషికన్నా పెద్దది ఇంకేదో ఉంటుందని నమ్ముతాను. కొన్ని డెస్టినీకి వదిలేయాలి. 

మూడు రోజులకోసారి ఫోన్‌ చార్జ్‌ చేస్తాను: 
నాకు అబ్జర్వేషన్‌ ఎక్కువ. ట్రావెల్‌ చేస్తుంటాను. అక్కడి మనుషుల మాట తీరు, వాళ్ల నడవడిక తెలుసుకుంటాను. నేచర్‌ నుంచి నేర్చుకోవడం ఇష్టం. అందుకే ఫోన్‌ పెద్దగా వాడను. నా ఫోన్‌ని మూడు రోజులకోసారి చార్జ్‌ చేస్తుంటాను. గాడ్జెట్స్‌ అంటే ఇష్టమే. కానీ నేచర్‌ ద్వారా నేర్చుకున్నది నేచురల్‌గా ఉంటుంది.

మా అమ్మ పెంపకం చాలా ట్రెడిషనల్‌: 
మా అమ్మ ప్రాపర్‌ తెలుగు ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలు ఎలా ఉంటారో అలానే ఉంటారు. ఏదైనా నేర్చుకోకపోతే ‘తర్వాత చూద్దాంలే’ అనుకోరు. మేం నేర్చుకోవాల్సిందే.  అలాగే తెలుగు బాగా మాట్లాడాల్సిందే అని పట్టుబట్టేవారు. అందుకే నాకు తెలుగు బాగా వచ్చింది. నా క్యారెక్టర్‌కి డబ్బింగ్‌ బాగా చెప్పగలిగాను. ఇంట్లో పండగలు బాగా చేస్తాం. సంవత్సరానికి ఒకసారైనా నేను తిరుపతి వెళ్లాల్సిందే. వినాయకుడు అంటే కూడా ఇష్టం. 

నో క్రష్‌:
అమ్మాయిలతో మాట్లాడటం అంటే నాకు చాలా బిడియం. ఇప్పుడు ఈ సినిమా చేయడం మొదలుపెట్టాక కొంచెం మొహమాటం పోయింది. అందరితో మాట్లాడగలుగుతున్నాను. సో... అమ్మాయిలతో మాట్లాడలేని అబ్బాయికి ఇక ‘క్రష్‌’ ఎందుకు ఉంటుంది? (నవ్వుతూ). 

యాక్టర్‌గా మాత్రమే కాదు...:
 సినిమాలో నటించడం వరకే అని ఫిక్స్‌ కాలేదు. డైరెక్షన్‌ అంటే ఇంట్రస్ట్‌ ఉంది. నాకు రైటింగ్‌ అంటే ఇష్టం. ఎప్పుడైనా నేను స్టోరీ రాశాననుకోండి... ఆ స్టోరీలోని ఎమోషన్‌కి బాగా కనెక్ట్‌ అవుతాను కాబట్టి నేనే హీరోగా చేస్తాను. నా నెక్ట్స్‌ సినిమాలకు కథలు విన్నాను. త్వరలోనే ఫైనలైజ్‌ అవుతాయి.

మా నాన్న మంచి యాక్టర్‌  
మా నాన్న మంచి యాక్టర్‌. డ్యాన్స్, ఫైట్స్, ఎమోషన్‌ అన్నీ బాగా చేశారు. అప్పుడప్పుడు ఆయన సినిమాలు చూస్తుంటాను. ముఖ్యంగా ‘బజారు రౌడీ’ నాకు చాలా ఇష్టం. నా సినిమా చూడ్డానికి నాన్న లేరనే బాధ చాలా ఉంది. అలాగే షూటింగ్‌ చేసేటప్పుడు ‘తాతయ్య, నాన్న ఉండి ఉంటే బాగుండేది’ అని చాలా సార్లు అనిపించింది. తాతగారిలా ప్రయోగాలు చేసే స్కోప్‌ వస్తే మంచిదే. ఒకప్పుడు తాతగారు వన్‌ ఇయర్‌కి 15 సినిమాలు కూడా చేశారు. ఇప్పుడు రెండు మూడు సినిమాలు చేస్తే ఎక్కువ. నాకైతే రెండు మూడు సినిమాలు చేయాలనుంది.

ఆ ఒత్తిడి లేదు
మాకు ఉన్న అడ్వాంటేజ్‌ ఫ్యాన్‌ బేస్‌. మా తాతగారు మాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్‌ మా ఫ్యాన్స్‌. ఇంకా ఒక్క సినిమా కూడా చేయలేదు... అప్పుడే ఫ్యాన్స్‌ అభిమానం ఎలా ఉంటుందో తెలిసింది. ఈ క్రెడిట్‌ మొత్తం మా ఫ్యామిలీకే. తాత నుంచి మాకు ఫార్వార్డ్‌ అయింది. తాతయ్యతో, బాబాయ్‌తో పోల్చుకుంటారేమో అనే ఒత్తిడి లేదు. ఆ కుటుంబం గర్వపడేలానే నటిస్తాను... పర్సనల్‌ బిహేవియర్‌ కూడా అంతే.
– డి.జి. భవాని 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement