మహేశ్‌ సినిమాకి అతిథిగా...?  | James Cameron Chief Guest for Mahesh Babu Rajamouli Movie | Sakshi
Sakshi News home page

మహేశ్‌ సినిమాకి అతిథిగా...? 

Feb 28 2024 12:01 AM | Updated on Feb 28 2024 12:01 AM

James Cameron Chief Guest for Mahesh Babu Rajamouli Movie - Sakshi

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో దర్శకుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. పైగా ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డు (‘నాటు నాటు..’ పాటకు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ అవార్డు) కూడా సాధించడంతో హాలీవుడ్‌ ప్రముఖుల దృష్టిలో పడ్డారు రాజమౌళి. ‘టైటానిక్, అవతార్‌’లాంటి అద్భుత చిత్రాల సృష్టికర్త జేమ్స్‌ కామెరూన్‌ అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని, రాజమౌళి మేకింగ్‌ని ప్రశంసించారు కూడా. రాజమౌళిలోని మేకర్‌ అంటే కామెరూన్‌కి మంచి అభిమానం ఏర్పడిందని ఆయన మాటలు స్పష్టం చేశాయి.

ఆ అభిమానంతోనే రాజమౌళి ఆహ్వానానికి కామెరూన్‌ పచ్చజెండా ఊపారని టాక్‌. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల్లోని పలు భాషల్లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. బడ్జెట్‌ రూ. వెయ్యి కోట్లు అని భోగట్టా. ఇంత భారీ చిత్రం కాబట్టేప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కామెరూన్‌ని ఆహ్వానించారని టాక్‌. ఇప్పటికే ప్రీప్రోడక్షన్‌ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో త్వరలో సినిమాని ఆరంభించాలనుకుంటున్నారట. సో.. వార్తల్లో ఉన్న ప్రకారం కామెరూన్‌ని రాజమౌళి ఆహ్వానించారా లేదా అనేది త్వరలోనే తెలిసిపోతుంది.

Advertisement
 
Advertisement
Advertisement