ప్రస్తుతం సినిమాల్లో ప్రత్యేక పాటలు చిత్రాలకు ఓ ట్రెండ్‌గా మారాయనే చెప్పాలి. ఈ తరహా పాటలు యూత్‌ను బాగా ఎట్రాక్ట్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాల్లో ప్రత్యేక పాటలు ట్రెండింగ్‌గా మారుతున్నాయనే చెప్పాలి. రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ చిత్రంలో నటి తమన్నా నటించిన నువ్వు కావాలయ్యా సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ పాటలో మిల్కీ బ్యూటీ డ్యాన్స్‌తో అదరగొట్టింది.
తాజాగా రజనీకాంత్ నటించిన జైలర్ 2 చిత్రం లో కూడా రెండు స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. ఇందులో ఒక పాటలో నటి పూర్ణ నటించారు. ఈ పాటను ఇటీవల విడుదల చేశారు. పాట బాగున్నా అనుకున్న రేంజ్లో రెస్పాన్స్ రాలేదు. అయితే ఇటీవల మరో ప్రత్యేక పాటను విడుదల చేశారు. దీన్ని పక్కా మాస్ మసాలా సాంగే అనాలి. ఇందులో కెనడాకు చెందిన నటి, మోడల్, డాన్సర్ గ్లామర్ డాల్ నోరా ఫతేరి నటించారు.
గతంలో ఈ బాలీవుడ్ బ్యూటీ తమిళం, తెలుగు,మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో, పాత్రల్లో నటించారు. ముఖ్యంగా తెలుగు చిత్రం బాహుబలి– 1లో మనోహరి అనే పాటలో మరో ముగ్గురు భామలతో కలిసి నటించి బాగా గుర్తింపు పొందారు. కాగా తాజాగా జైలర్ 2 చిత్రంలో నటించిన బిందాస్ అనే పాటలో నోరా ఫతేరి అనే పాట యూట్యూబ్ ఛానళ్లలో హల్ చల్ చేస్తోంది. జైలర్ చిత్రంలో తమన్నా ఎలాగైతే అందాల మోత మోగించారో, అదేవిధంగా ఇప్పుడు నటి నోరా ఫతేరి కూడా ఏ మాత్రం ఒళ్లు దాచుకోకుండా బిందాస్ పాటలో నటించారు.అయితే జైలర్ చిత్రంలోని తమన్నా నటించిన నువ్వు కావాలయ్యా పాటను ఈ బిందాస్ పాట బీట్ చేస్తుందా ? లేదా అనేది మూవీ రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.


