ఆ పాత్రల గురించి రెండు రోజులు మాట్లాడతారు: నిర్మాత దీప్తి గంటా | Producer Deepthi Ganta about alias Rukmini movie | Sakshi
Sakshi News home page

ఆ పాత్రల గురించి రెండు రోజులు మాట్లాడతారు: నిర్మాత దీప్తి గంటా

Nov 28 2026 12:30 AM | Updated on Nov 28 2026 12:30 AM

Producer Deepthi Ganta about alias Rukmini movie

‘‘ఆకాశంలో ఒక తార’ లాంటి సినిమాలు చూసినప్పుడు ఆ పాత్రలతో  మనం లీనమై పోయి వాటిని గుర్తుపెట్టుకుంటాం. ‘అలియాస్‌ రుక్మిణి’ కూడా గుర్తు పెట్టుకునే మంచి సినిమా. ఈ చిత్రం చూసిన తర్వాత రెండు రోజుల పాటు ఆ పాత్రల గురించి ప్రేక్షకులు మాట్లాడతారు. ఈ సినిమా జర్నీలో భాగమయ్యేలా ఆడియన్స్‌కి  ఒక మంచి అనుభూతినిస్తుందని నమ్ముతున్నాను’’ అని నిర్మాత దీప్తి గంటా చెప్పారు.

నితిన్‌ హీరోగా ఆఫియా సయ్యద్‌ హీరోయిన్‌గా మురళీకాంత్‌ దేవసోత్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘అలియాస్‌ రుక్మిణి’. హీరో నాని సమర్పణలో దీప్తి గంటా నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా దీప్తి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అలియాస్‌ రుక్మిణి’ కథ చదివినప్పుడు మురళీకాంత్‌ ‘దండోరా’ తీసిన దర్శకుడు అని నాకు తెలియదు.

కథ నచ్చే ఈ సినిమా చేశాను. నానీకి కూడా నచ్చడంతో సినిమా మొదలుపెట్టాం. మురళీకాంత్‌ మంచి విజన్‌ ఉన్న దర్శకుడు. సాయికుమార్, హర్షవర్ధన్‌గారి పాత్రలు మన ఇంట్లోని మనుషుల్లా సహజంగా ఉంటాయి.

ఆఫియాకి ఇది తొలి చిత్రమైనా చక్కగా నటించింది. రుక్మిణి అనే కలం పేరుతో కథలు రాస్తుంటాడు కృష్ణ (నితిన్‌). అసలు ఆ కలం పేరుతో ఎందుకు కథలు రాస్తున్నాడనేది ఆసక్తిగా ఉంటుంది. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా ఉంటాయి. నా తర్వాతి సినిమా ‘కోర్ట్‌’ మూవీ ఫేమ్‌ జగదీష్‌ దర్శకత్వంలో ఉంటుంది’’ అని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement