టైటిల్: డాడ్స్ లిటిల్ ఫ్రెండ్
నటీనటులు: రజత్ రాఘవ్, కాజల్ చౌదరీ, బేబీ పరినీత రుద్రరాజు, హసిని సుధీర్ తదితరులు
దర్శకత్వం: శరత్
నిర్మాత: దూప దీపక్
నిర్మాణ సంస్థ: వెన్నెల సిల్వర్ స్క్రీన్
విడుదల తేదీ: నవంబర్ 27
ఈ శుక్రవారం బాక్సాఫీస్ బరిలో చాలా సినిమాలు నిలిచాయి. వీటిలో ముఖ్యంగా భోగి, నాన్న కుట్టి చిత్రాలపైనే ఆడియన్స్‌లో బజ్ నెలకొంది. వీటితో పాటు పలు చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అలా ఈ ఫ్రైడే రిలీజైన మరో టాలీవుడ్ మూవీ డాడ్స్ లిటిల్ ఫ్రెండ్. శరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
టైటిల్ చూడగానే కథేంటో అర్థమయ్యే ఉంటుంది. టైటిల్‌లోనే తండ్రీ, పిల్లలకు మధ్య సాగే సెంటిమెంట్ కథ అని తెలిసిపోతోంది. అలా చిన్న పిల్లల నేపథ్యంలో టాలీవుడ్‌లో చాలా కథలొచ్చాయి. చాలావరకు ఇలాంటి స్టోరీస్ సక్సెస్ అయ్యాయి. అలా బాల్యం ఆధారంగా వచ్చిన మరో సినిమానే డాడ్స్ లిటిల్ ఫ్రెండ్. ఈ ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఆకాంక్ష(కాజల్ చౌదరి) సింగిల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటోంది. తనకు కూతురు పరిణీత(పరిణీత రుద్రరాజు) ఉంటుంది. భర్త ఏమయ్యాడనేది తెలియదు. అయితే ఆకాంక్ష క్యాన్సర్ బారిన పడి.. తన కూతురుని చైల్డ్ కేర్ సెంటర్‌కు పంపిస్తుంది. కానీ అక్కడ ఆ చిన్నారి ఉండదు. అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. తాను అంకుల్ సంరక్షణలో ఉన్నానని అందరినీ నమ్మిస్తూ సొంత ఇంట్లోనే ఉంటూ స్కూలుకు వెళ్తుంది. తల్లి నేర్పించిన స్ట్రింగ్ ఆర్ట్‌తో బొమ్మలు తయారు చేస తన ఖర్చులు తానే చూసుకుంటుంది. ఇదే క్రమంలో సింగపూర్ నుంచి వచ్చిన రాహుల్ (రజత్ రాఘవ్).. తాను తండ్రినంటూ పరిణీత జీవితంలోకి అడుగుపెడతాడు. అయితే రాహుల్‌ను పరిణీత అసహ్యించుకుంటుంది. రాహుల్‌ను పరిణీత ఎందుకు ద్వేషిస్తోంది? తన కూతురి మనసు గెలవడానికి రాహుల్ ఏం చేశాడు? పరి తల్లి తన తండ్రి గురించి ఎందుకు చెప్పలేదు? అన్నదే అసలు కథ.
ఎలా ఉందంటే..
తండ్రీ, కూతురి సెంటిమెంట్ ఆధారందా వచ్చిన కథే ఈ డాడ్స్ లిటిల్ ఫ్రెండ్. ఇటీవల టాలీవుడ్ ఇరుముడి కూడా అలాంటి సెంటిమెంట్‌తోనే వచ్చి హిట్ కొట్టింది. అయితే ఇందులో తండ్రీకూతుళ్ల ప్రేమకు భిన్నంగా, వారి మధ్య ఉండే అపార్థాలు, కోపం చుట్టూ తిరిగే కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు డైరెక్టర్ శరత్. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే సున్నితమైన ఎమోషన్స్ పండించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ కథలో భిన్నమైన కోణంలో ఆవిష్కరించారు.
చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన చిన్నారి ఒంటరితనం, తనకు ఎవరూ లేరన్న బాధను దర్శకుడు హృదయానికి హత్తుకునేలా చేశాడు. పేరేంట్స్ లేకపోతే పిల్లల లైఫ్ ఎలా ఉంటుందనే సందేశమిచ్చారు. సెకండాఫ్‌లో ఈ కథ మరింత ఎమోషనల్‌గా మార్చేశాడు. కూతురి మనసు గెలుచుకునేందుకు తండ్రి చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. కథనం స్లోగా ఉన్నప్పటికీ..క్లైమాక్స్ సీన్స్ మాత్రం కంటతడి పెట్టిస్తాయి. చివరగా తల్లిదండ్రులను ఆలోచించేలా చేశాడు డైరెక్టర్. దర్శకుడు శరత్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఎక్కడా కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా.. కథను నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్‌గా చూస్తే మనసును హత్తుకునే ఒక ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామాను ప్రేక్షకులకు అదించాడు.
ఎవరెలా చేశారంటే..
సింగిల్ మదర్‌గా ఆకాంక్ష (కాజల్ చౌదరి) తన నటనతో ఆకట్టుకుంది. ఆమె కుమార్తె పరిణిత అలియాస్ పరి (బేబీ పరిణిత రుద్రరాజు) క్యూట్‌గా మెప్పించింది. రాహుల్ (రజత్ రాఘవ్) తన పాత్రలో ఒదిగిపోయారు. తండ్రిగా భావోద్వేగాలతో ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో అలరించారు. కుశ్వంత్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్. ఆర్‌హెచ్ విక్రమ్ నేపథ్య సంగీతం ఫర్వాలేదు. ఎమోషన్ సీన్స్‌లో అద్భుతంగా ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా ఉన్నాయి.


