
మనకు ఎందరో హీరోలు ఉన్నారు కానీ నేషనల్ అవార్డ్ విన్నర్ ఇప్పటికీ ఒక్కరే. అయితే ఎవరికైనా విజయాలు ఎవరికీ ఊరకనే రావు కష్టపడడం అనే ప్రాధమిక లక్షణంతో పాటు తమను తాము ఎప్పటికప్పుడు మార్పు చేర్పులు చేసుకోవడం, ఇంకా ఎన్నో ప్రయాసలు అందులో ఇమిడి ఉంటాయి. ఒక విజయవంతమైన వ్యక్తిలో అలాంటి మార్పు చేర్పులకు ఎన్నోదోహదం చేస్తాయి. తమకు ఎదురైన సంఘటనలు కావచ్చు తాము ఎదుర్కున్న సమస్యలు కావచ్చు తాము విన్న ప్రసంగాలు లేదా చదివిన పుస్తకాలు కూడా కావచ్చు. వారి వ్యక్తిత్వ వికాస క్రమంలో ఇమిడి ఉంటాయి.
గంగోత్రి సినిమాతో మొదలై స్టైలిష్ స్టార్ తో ఆగకుండా ఐకాన్ స్టార్ దాకా ఎదిగిన అల్లు అర్జున్ ప్రయాణంలో కూడా అలాంటివే ఉన్నాయి. తాజాగా బన్నీ తన జీవితాన్ని మార్చిన పుస్తకం గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ది క్రియేటివ్ యాక్ట్: ఏ వే ఆఫ్ బీయింగ్‘ (రిక్ రూబిన్ రచన)ను తన ఆల్‌టైమ్ ఫేవరెట్స్‌లో ఒకటిగా పేర్కొన్నాడు. అలాగే ఈ పుస్తకం తన జీవితాన్నే మార్చిందని తన ఇన్ స్ట్రాగామ్ పోస్ట్‌లో చెప్పాడు. సృజనాత్మక రంగంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఆ పుస్తకాన్ని చదవాలని కూడా బన్నీ సూచించాడు. మరి అల్లు అర్జున్‌ను మెప్పించిన, జీవితాన్నే మార్చిన ఆ పుస్తకం విశేషాలు తెలుసుకుందాం..
ది క్రియేటివ్ యాక్ట్ – ఏ వే ఆఫ్ బీయింగ్
ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ ప్రొడ్యూసర్ అమెరికాకు చెందిన రిక్ రూబిన్ (63)రాసిన ది క్రియేటివ్ యాక్ట్ ఏ వే ఆఫ్ బీయింగ్ (సహ రచయిత: నీల్ స్ట్రాస్). డెఫ్ జామ్ రికార్డింగ్స్‌అనే హిప్ హాప్ లేబుల్ కూడా స్థాపించిన రిక్ రూబిన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో వివిధ రకాల కళాకారులతో పని చేసిన తన అనుభవాలే ఆధారంగా సృజనాత్మకతపై తన దృక్పథాన్ని ఈ పుస్తకంలో పంచుకున్నారు.
సృజన అనేది మనం చేసే పనిలో కాదు మన దృష్టి, మనసు, పరిసరాలను చూసే తీరులో ఉంటుందనేది రచయిత అభిప్రాయం. సృజనాత్మకతను ఒక ప్రత్యేక ప్రతిభగా కాకుండా మనిషి జీవన విధానంలో భాగంగా ఇది చూపిస్తుంది. సాధారణ మానవుడు కూడా సృజనాత్మకతను అలవాటు చేసుకోవచ్చని, అది మనసు విపులీకరణలో ఉందని ఈ పుస్తకం చెబుతుంది. కళాకారులు స్వతహాగా సృష్టించేవారు కారనీ వారు సృజనాత్మక ప్రవాహానికి రిసీవర్లు అని రూబిన్ అభిప్రాయం.
గత 2023 జనవరిలో విడుదలైన ఈ పుస్తకం 432 పేజీలతో, ‘క్రియేటివిటీ‘ ‘పర్సనల్ ట్రాన్స్ ఫార్మేషన్‘ విభాగాలకు చెందిన పుస్తకాల్లో అత్యంత అధికంగా విక్రయాలు సాధించిన పుస్తకాలలో ఒకటిగా నిలిచింది. పుస్తకం 78 చిన్న భాగాలుగా విభజించారు. ఒక్కో భాగం వేర్వేరుగా చదువుకోవచ్చు. ఈ పుస్తకం అనేక మంది ప్రశంసలతో పాటు న్యూయార్క్ టైమ్స్ నంబర్ వన్ బెస్ట్‌సెల్లర్ గా నిలిచింది. బ్రిటిష్ మార్కెట్లో బాగా హిట్ అయ్యింది. దీని ధర రూ.615; కాగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ.595 (సగటు ధరలో 40% తగ్గింపు) కే లభిస్తోంది.