
అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమాలు
సై అంటున్న తెలుగు హీరోలు
ఇండియన్ సినిమా రేంజ్ మారిపోతోంది. ప్రపంచమంతా ఇండియన్ సినిమావైపు చూస్తోంది. జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్, జేజే అబ్రామ్స్, డేనియల్ క్వాన్ వంటి... హాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్‌మేకర్స్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను మెచ్చుకున్న విషయాన్ని అంత త్వరగా మర్చిపోలేము. మన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు వచ్చిన ఆస్కార్ అవార్డునూ మర్చిపోలేము. ఈ ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారతీయ ఫిల్మ్ మేకర్స్ హాలీవుడ్ రేంజ్‌కి తగ్గ సినిమాలను సిద్ధం చేస్తున్నారు. అలా పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్ రేంజ్‌లో సినిమాలు చేస్తున్న కొందరు హీరో–దర్శక–నిర్మాతలపై ఓ లుక్ వేయండి.
ఇంటర్‌నేషనల్ ప్లాన్
‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మాధవన్ ఓ కీలక పాత్రలో నటిస్తారని, అతనిది మహేశ్‌బాబు తండ్రి పాత్ర అనే ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఫారెస్ట్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాల చిత్రీకరణ కోసం యూనిట్ విదేశాలకు వెళ్లనుంది. ఇంతవరకు బాగానే ఉంది.
కానీ... ప్రతిసారీ తన సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలోనో లేదా షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల తర్వాతనో తన సినిమా గురించి ఓ మీడియా సమావేశం నిర్వహించి, ఆ సినిమా కథ క్లుప్తంగా చెబుతారు రాజమౌళి. ఆ సమావేశం లోనే నటీనటుల వివరాలు, షూటింగ్ షెడ్యూల్స్, రిలీజ్ వివరాలు ఉండేవి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. కానీ మహేశ్‌బాబుతో చేస్తున్న సినిమా విషయంలో రాజమౌళి ఈ పంథాను ఫాలో కాలేదు. ఆ మాటకొస్తే... ఇప్పటివరకు రాజమౌళి–మహేశ్‌బాబు సినిమా గురించిన పూర్తి స్థాయి అధికారిక ప్రకటనే రాలేదు. మరి... దీని వెనక కారణం ఏంటో రాజమౌళికే తెలియాలి.
ఆస్కార్ ప్లాన్: 95వ ఆస్కార్ అవార్డ్స్‌లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగం కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఎంపిక అవుతుందని సినిమా లవర్స్ ఊహించారు. కానీ ఈ విభాగంలో భారతదేశం తరఫున ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో (ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ ఫిల్మ్ షో’)ను ఎంపిక చేసింది. కానీ ‘లాస్ట్ ఫిల్మ్ షో’ సినిమాకు ఆస్కార్ రాలేదు. అయితే ఆస్కార్ కన్సిడరేషన్‌కు ‘ఆర్‌ఆర్‌ఆర్’ను పంపి, ఆస్కార్ కమిటీ రూల్స్‌ను ఫాలో చేసి, మొత్తానికి ఆస్కార్ బరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను రాజమౌళి అండ్ టీమ్ నిలపగలిగింది.
ఓ దశలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో లీడ్ యాక్టర్స్‌గా చేసిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు కూడా బెస్ట్ యాక్టర్ విభాగంలో నామినేషన్స్ వస్తాయేమో అన్నట్లుగా హాలీవుడ్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఇది జరగలేదు కానీ... ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘నాటు నాటు’ పాటకు కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. కానీ ఈసారి ఆ తరహా ఇబ్బందులు ఏవీ రాకూడదని, ఓ హాలీవుడ్ ప్రముఖప్రోడక్షన్ సంస్థతో భాగస్వామ్యం కావాలని రాజమౌళి ప్రణాళికలు రచిస్తున్నారట. ఇలా ఓ హాలీవుడ్ ప్రముఖ నిర్మాణసంస్థతో భాగం అయితే, తమ సినిమా కూడా ఇంగ్లిష
విదేశీ స్పిరిట్
‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయారు ప్రభాస్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా సినిమాగానే రిలీజ్ అవుతోంది. కానీ సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్ చేయనున్న ‘స్పిరిట్’ మాత్రం భారతీయ భాషలతో పాటు జపాన్, చైనీస్, కొరియన్ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ విషయాన్ని ‘స్పిరిట్’ సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అయితే ఈ సినిమా చిత్రీకరణ ఇంకాప్రారంభం కాలేదు. ప్రస్తుతం ‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌నుప్రారంభిస్తారు ప్రభాస్. ఈ సినిమాలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఇందులో త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తారు. కొరియన్ యాక్టర్ డాన్ లీ ‘స్పిరిట్’ సినిమాలో విలన్‌గా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రణయ్ వంగా రెడ్డి, భూషణ్‌కుమార్ ఈ సినిమాను నిర్మించనున్నారు.
గాడ్ ఆఫ్ వార్
‘ఆర్‌ఆర్‌ఆర్’ (ఇందులో రామ్‌చరణ్ మరో లీడ్ రోల్ చేశారు) సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ పేరు సంపాదించుకున్నారు. ఈ గుర్తుంపుకి తగ్గట్లుగా అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమాను రిలీజ్ చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్–దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ మైథాలజీ సినిమా రానుంది.
గాడ్ ఆఫ్ వార్‌గా చెప్పుకునే కుమారస్వామి నేపథ్యంలో సాగే ఈ మైథాలజీ సినిమాను ‘రామాయణ’ తరహాలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తామని, వచ్చే ఏడాది షూటింగ్‌ప్రారంభం అవుతుందని నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను నిర్మించాలనుకుంటున్నారు కాబట్టి అదే స్థాయిలో రిలీజ్‌ను ప్లాన్ చేస్తారు మేకర్స్. పైగా ఎన్టీఆర్ ఓ లీడ్ రోల్‌లో నటించిన స్పై యాక్షన్ డ్రామా ‘వార్ 2’ ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ వెర్షన్ థియేటర్స్‌లో విడుదలవుతోంది. ఇది కూడా ఎన్టీఆర్‌కు బాగా కలిసొచ్చే అంశమే. ఇక హృతిక్ రోషన్, కియారా అద్వానీ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
తెలుగు హీరో వర్సెస్ హాలీవుడ్ విలన్
హీరో అల్లు అర్జున్–దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రానుంది. ఈ సినిమా కోసం ఓ సరికొత్త లోకాన్నే సృష్టిస్తున్నారట అట్లీ. కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కనిపించే మాదిరి ఈ చిత్రంలోనూ కొన్ని విచిత్రమైన జంతువులు, జీవరాసులు కనిపిస్తాయట. ఆ దిశగా అల్లు అర్జున్, అట్లీ అండ్ టీమ్ సినిమాను సిద్ధం చేస్తున్నారని టాక్. ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు పాత్రల్లో కనిపిస్తారని, తాత–తండ్రి–ఇద్దురు కొడుకులు... ఇలా విభిన్నమైన పాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే ఐదుగురు హీరోయిన్స్ కూడా ఉంటారట. వీరిలో దీపికా పదుకోన్ కన్ఫార్మ్ అయిపోయారు. మిగిలిన హీరోయిన్స్ పాత్రలకు రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, భాగ్య శ్రీ బోర్సే, ఆలియా ఎఫ్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి.
అలాగే ఈ సినిమాలోని విలన్ పాత్రల కోసం విన్ డిజీల్, ది రాక్...వంటి హాలీవుడ్ స్టార్ యాక్టర్స్ పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇలా అయితే తమ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో విడుదల చేసేటప్పుడు బాగుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట. దాదాపు రూ. 700 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ఒకేసారి భారతీయ భాషలతో పాటు ఇతర విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేసేలా సన్నాహాలు మొదలు పెట్టారట అట్లీ అండ్ టీమ్. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన లాంగ్ షెడ్యూల్ ఆ మధ్య ముంబైలోప్రారంభమైంది. చిన్న బ్రేక్ రావడంతో అల్లు అర్జున్ వెకేషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లారట. వచ్చిన తర్వాత తిరిగి షూటింగ్ ఆరంభిస్తారు.
రామాయణ
రూ. నాలుగువేల కోట్ల భారీ బడ్జెట్‌తో ‘రామాయణ’ (రెండు భాగాలు కలిపి) సినిమాను నిర్మిస్తున్నామని, ఈ చిత్రంతో ప్రపంచ సినిమా అంతా భారతదేశం వైపు చూస్తుందని, ఇందులో ఏ మాత్రం సందేహం లేదని ఈ చిత్ర నిర్మాత, డీఎన్‌ఈజీ (డబుల్ నెగటివ్) స్టూడియో అధినేత నమిత్ మల్హోత్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నమిత్ మల్హోత్రా వ్యాఖ్యలను బట్టి నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణ’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని ఊహించవచ్చు. పైగా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్‌లతో పాటు హాలీవుడ్‌లో అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్లు టెర్రీ నోటరీ, గై నోరిస్, హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసినప్రోడక్షన్ డిజైనర్లు రవి బన్సాల్, రాంసే ఏవరీ వంటి బలమైన సాంకేతిక నిపుణులతో ‘రామాయణ’ రూపొందుతోంది.
ఇక బడ్జెట్ పరంగా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం‘రామాయణ’నే అవుతుంది. ఇంకా ‘డీఎన్‌ఈజీ’ స్టూడియో గ్రాఫిక్ వర్క్ చేసిన సినిమాల్లో 8 చిత్రాలు ఆస్కార్ అవార్డులను సాధించాయి. ఇవన్నీ ‘రామాయణ’ సినిమా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతోందని చెప్పడానికి కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ హిందీ ‘రామాయణ’ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవిదూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుంది.‘రామాయణ పార్ట్ 1’ 2026 దీపావళికి, ‘రామాయణ పార్ట్ 2’ సినిమా 2027 దీపావళికి విడుదల కానున్నాయి. ఇటీవలే
సూపర్ హీరో
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్, తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఓ సూపర్ హీరో సినిమా రానుంది. కార్తీతో ‘ఖైదీ 2’ సినిమా చేసిన తర్వాత, ఆమిర్ ఖాన్‌తో ఈ సూపర్ హీరో మూవీ చేస్తారు లోకేశ్ కనగరాజ్. కాగా ఈ సూపర్ హీరో సినిమాను గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రెడీ చేస్తామని, రిలీజ్ కూడా అంతర్జాతీయ స్థాయిలోనే ఉంటుందని ‘కూలీ’ సినిమా ప్రమోషన్స్‌లో చెప్పారు దర్శకుడు లోకేశ్ కనగరాజ్.
2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా షూటింగ్‌ప్రారంభం కానుంది. 2028లో విడుదలయ్యే చాన్సెస్ ఉన్నాయి. అలాగే ‘మహాభారతం’ ఆధారంగా ఆమిర్ ఖాన్ మూడు భాగాలుగా ఓ సినిమాలో నటించి, నిర్మించనున్నారు. ఈ ఆగస్టు నుంచి ఈ సినిమానుప్రారంభించనున్నట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ తెలిపారు. ఈ సినిమాను కూడా అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాలన్నది ఆమిర్ ప్లాన్ అని బాలీవుడ్ టాక్.
ఈ చిత్రాలతో పాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలను పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఆయా సినిమాల హీరోలు–దర్శక–నిర్మాతలు ప్రణాళికలు వేస్తున్నారు. – ముసిమి శివాంజనేయులు