ఐ హోస్టేజ్‌ రివ్యూ: వామ్మో... ఆపిల్‌ స్టోరా... హడలెత్తించే థ్రిల్లర్‌ | iHostage Movie OTT Review in Telugu | Sakshi
Sakshi News home page

iHostage Movie Review: ఐ హోస్టేజ్‌.. థ్రిల్లర్‌ మూవీ రివ్యూ

Apr 28 2025 1:08 AM | Updated on Apr 28 2025 7:48 AM

iHostage Movie OTT Review in Telugu

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో హాలీవుడ్‌ చిత్రం ‘ఐ హోస్టేజ్‌’ (iHostage)ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

ఉన్నవి రెండుపాత్రలు... వాటికి అనుసంధానంగా అడపా దడపా వచ్చే మరో డజనుపాత్రలు. కథ మొత్తం ఆ రెండుపాత్రల మధ్యే. అయినా ప్రేక్షకుడిని క్షణం కూడా కన్నార్పనీయకుండా కట్టిపడేసే విథంగా థ్రిల్లర్‌ జోనర్‌తో సినిమా నడపడం డచ్‌ దర్శకుడైన బాబీ బోర్‌మెన్స్‌కి మాత్రమే చెల్లింది. అదే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ‘ఐ హోస్టేజ్‌ సినిమా. ఆపిల్‌ స్టోర్‌... ఐ ఫోన్‌ నుండి ఐ ప్యాడ్ల వరకు ప్రతి దానికి ఆపిల్‌ స్టోరే కదా... ఈ సినిమాకి మూలం అదే.  అమెరికా, ఆస్ట్రేలియా, చైనా తదితర దేశాలలో ఆపిల్‌ స్టోర్‌లు ఘనంగా దాదాపు 5 ఫ్లోర్లు పైనే విశాలంగా పెద్ద భవంతిలో ఉంటాయి.

అది కూడా నగరానికి మధ్యలోనే ఉంటాయి. కథా పరంగా ఆమ్‌స్టర్‌డామ్‌ నగరం మధ్యలోని ఓ ఆపిల్‌ స్టోర్‌ బోలెడంత మంది కస్టమర్లతో కళకళలాడుతుంటుంది. అప్పుడు ఆ స్టోర్లోకి కూరగాయల సంచితో ఓ వ్యక్తి వచ్చి తన దగ్గర ఉన్న తుపాకీ తీసి అందరినీ హడలుగొట్టి, ఓ వ్యక్తిని బందీగా తీసుకుంటాడు. అంతేకాదు తన దగ్గర పేలుడు పదార్థాలు ఉన్నాయని బెదిరించి, తనకు మిలియన్ల డబ్బుతోపాటు అక్కడ నుండి తప్పించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయమని అధికారులకు ఫోన్‌లో చెప్తాడు. ఇక సినిమా మొత్తం దాదాపుగా ఆ ఇద్దరి మధ్యే నడుస్తుంది.

సినిమా ఆ ఇద్దరి మీదే నడిచినా మంచి స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నారు దర్శకుడు. సినిమా చివర్లో బందీగా తీసుకున్న వ్యక్తితో తను బయటపడగలిగాడా? లేదా? తాను డిమాండ్‌ చేసిన డబ్బులు అందుకున్నాడా? లేదా అనేది తెలుసుకోవాలంటే మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ‘ఐ హోస్టేజ్‌ సినిమాని చూసేయండి. ఈ సినిమా ద్వారా మానసికంగా ప్రేక్షకుడికి భయాన్ని పూర్తిగా పరిచయం చేశారు దర్శకుడు.

అది కూడా చిన్నపాటి ఘర్షణ లేకుండా, ఒక్క బుల్లెట్‌ పేలకుండా... మరీ ముఖ్యంగా ఎటువంటి పేలుళ్లు జరగకుండా సైకలాజికల్‌గా సినిమాని తీసుకువెళ్లారు. సినిమా చూసిన తరువాత మాత్రం వామ్మో... ఆపిల్‌ స్టోరా ఇంక వెళ్లొద్దు బాబు అని కనీసం పది మందిలో సగమైనా అనుకుంటారు. మరి... మీరు కూడా ఆలస్యం కాకుండా ఈ సినిమా చూసేయండి. అయితే ఆపిల్‌ స్టోర్‌కి మాత్రం వెళ్లడం మానకండి. – హరికృష్ణ ఇంటూరు

Advertisement
 
Advertisement
Advertisement