
సిల్వర్ స్క్రీన్‌పై కొన్ని జంటల మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. ఆ జంటను మరిన్ని సినిమాల్లో చూడాలనేంతగా వారి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుంది. పైగా ఈ పెయిర్ నటించిన సినిమా హిట్ అయితే... ‘హిట్ జోడీ’ అనే పేరు కూడా వస్తుంది. అలా వెండితెరపై తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు హిట్ కూడా అందుకున్న కొన్ని జంటలు మళ్లీ కలిసి నటిస్తున్నాయి. ఒకరు రెండోసారి జత కడితే... మరొకరు మూడోసారి... ఇంకొకరు ఏకంగా ఏడో సారి... ఇలా హిట్ మేజిక్‌ని రిపీట్ చేయడానికి రిపీట్ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం.

ఎన్నాళ్లకెన్నాళ్లకు...
హీరో చిరంజీవి(Chiranjeevi), హీరోయిన్ త్రిష కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘స్టాలిన్’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 సెప్టెంబరు 20న విడుదలై, హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు. 19 ఏళ్ల తర్వాత వీరి జోడీ ‘విశ్వంభర’(Vishwambhara) సినిమాతో రిపీట్ అవుతోంది. ‘బింబిసార’ మూవీ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విక్రమ్ రెడ్డి సమర్పణలో వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష మెయిన్ హీరోయిన్ కాగా ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా రూ΄÷ందుతోన్న ‘విశ్వంభర’ 2026 వేసవిలో విడుదల కానుంది.

రెండోసారి...
హీరో చిరంజీవి– హీరోయిన్ నయనతార(Nayanthara) కాంబినేషన్ రెండోసారి రిపీట్ అవుతోంది. వీరిద్దరూ తొలిసారి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 అక్టోబరు 2న రిలీజైంది. ఆ తర్వాత చిరంజీవి, నయనతార కలిసి ‘గాడ్‌ఫాదర్’ (2022) చిత్రంలో అన్నా–చెల్లెలుగా నటించారు. తాజాగా వీరిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ మూవీ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి చిరంజీవి–నయనతార సందడి చేసిన ‘మీసాల పిల్ల...’ అంటూ సాగే తొలి పాట ప్రోమోని విడుదల చేయగా అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
27 ఏళ్ల తర్వాత...
కొన్ని జంటలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. హీరో నాగార్జున(Nagarjuna Akkineni), హీరోయిన్ టబు జోడీ కూడా అలాంటిదే. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు నాగార్జున–టబు. 1996 అక్టోబరు 4న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున–టబు కలిసి నటించిన రెండో చిత్రం ‘ఆవిడా మా ఆవిడే’. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1998 జనవరి 14న విడుదలైంది. ఈ చిత్రంలోనూ తమదైన నటనతో సందడి చేసిన వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్.
నాగార్జున కెరీర్‌లో 100వ సినిమాగా రూపొందుతోన్న చిత్రానికి తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కింగ్ 100’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. ఈ చిత్రం కోసం 27 ఏళ్ల తర్వాత మరోసారి జోడీగా నటించనున్నారట నాగార్జున–టబు. నాగార్జున కెరీర్‌లో మైలురాయిలాంటి ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని, వారిలో టబు ఓ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. ‘సిసింద్రి’ (1995) సినిమాలో నాగార్జున– టబు ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ సాగే స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసిన విషయం తెలిసిందే.
ఏడోసారి...
హీరో వెంకటేశ్(Venkatesh), హీరోయిన్ మీనాలది ప్రత్యేకమైన జోడీ. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం, దృశ్యం, దృశ్యం 2’ వంటి అరడజను సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో వీరి జోడీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఇప్పుటికే డబుల్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్న వీరిద్దరూ ‘దృశ్యం 3’ సినిమా కోసం మరోసారి జోడీగా నటించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘దృశ్యం’ (2014), ‘దృశ్యం 2’ (2021) సినిమాలు అద్భుతమైన హిట్స్ అందుకున్నాయి.
ఈ సిరీస్‌లో రానున్న తాజా చిత్రం ‘దృశ్యం 3’. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్, మీనా జోడీగా మలయాళంలో ‘దృశ్యం 3’ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. తెలుగులోనూ రూపొందనున్న ‘దృశ్యం 3’లో వెంకటేశ్–మీనా మరోసారి జంటగా నటించి, ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం పూర్తయ్యాక ‘దృశ్యం 3’ సెట్స్‌పైకి వెళ్లనుంది.
థియేటర్లలో జాతర
హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల కలిసి థియేటర్లలో ‘మాస్ జాతర’ చూపించేందుకు సిద్ధం అయ్యారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘ధమాకా’. నక్కిన త్రినాథరావ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2022 డిసెంబరు 23న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రవితేజ–శ్రీలీల డ్యాన్సులు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ధమాకా’ వంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ద్వితీయ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. రవితేజ కెరీర్‌లో 75వ చిత్రంగా ‘మాస్ జాతర’ రూ΄÷ందడం.. రవితేజ–శ్రీలీల హిట్ జోడీ రిపీట్ అవుతుండటం.. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతానికి ఇప్పటికే అద్భుతమైన స్పందన రావడం... వంటి కారణాలతో ఈ చిత్రంపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది.
సలార్: శౌర్యాంగపర్వంలో...
‘బాహుబలి’ చిత్రం తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన ‘ది రాజా సాబ్, ఫౌజి, స్పిరిట్’ వంటి చిత్రాలు చేస్తున్నారు. ఆ తర్వాత ‘సలార్: శౌర్యాంగపర్వం’ మూవీ చేస్తారు. ప్రభాస్, శ్రుతీహాసన్ జోడీగా నటించిన తొలి చిత్రం ‘సలార్: పార్ట్ 1 సీజ్‌ఫైర్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ మూవీ 2023 డిసెంబరు 22న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రభాస్ యాక్షన్... ప్రశాంత్ నీల్ టేకింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘సలార్: పార్ట్ 2 శౌర్యాంగపర్వం’ రూపొందనున్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో అలరించిన ప్రభాస్– శ్రుతీహాసన్ జోడీ ద్వితీయ భాగంలోనూ అలరించబోతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారాయన. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాతే ‘సలార్: పార్ట్ 2 శౌర్యాంగపర్వం’ పై దృష్టి పెడతారట. ‘సలార్: ΄ార్ట్ 1 సీజ్‌ఫైర్’ చూసిన వారందరూ ‘సలార్: ΄ార్ట్ 2 శౌర్యాంగపర్వం’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరోసారి...
నాని హీరోగా నటించిన ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ (2019) చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు ప్రియాంకా మోహన్. ఆ తర్వాత మరోసారి వీరిద్దరూ ‘సరి΄ోదా శనివారం’ (2024) సినిమాలో నటించారు. ఇప్పటికే రెండు సినిమాల్లో సందడి చేసిన ఈ జంట మరోసారి జోడీగా కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘సాహో, ఓజీ’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ్ర΄ారంభమైంది. ఈ సినిమాలో నానీకి జోడీగా ప్రియాంకా మోహన్ నటించనున్నారట. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహించిన ‘ఓజీ’ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు ప్రియాంక. తాజాగా నాని సినిమాలో ఆమెని హీరోయిన్‌గా తీసుకోనున్నారట సుజీత్. పైగా నాని–ప్రియాంక కాంబినేషన్‌కి కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండటంతో వీరు మూడోసారి నటించడం పక్కా అనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట.
ముచ్చటగా మూడోసారి...
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా కలిసి ముచ్చటగా మూడోసారి జోడీగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘గీత గోవిందం’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018 ఆగస్టు 15న విడుదలై సూపర్ హిట్‌గా నిలవడంతో ΄ాటు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ మూవీ తర్వాత విజయ్–రష్మిక నటించిన ద్వితీయ చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 జూలై 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా విడుదలైన ఆరేళ్ల తర్వాత వీరిద్దరూ మూడోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్’). గతంలో విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ ‘వీడీ 14’కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలోనే మరోసారి విజయ్–రష్మిక పెయిర్‌గా మారారు. ఇదిలా ఉంటే రీల్ లైఫ్‌లో జోడీగా నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక రియల్ లైఫ్‌లో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 3న వీరి నిశ్చితార్థం జరిగింది. 2026 ఫిబ్రవరిలో విజయ్–రష్మికల వివాహం జరగనుంది.
ఎనిమిదేళ్ల తర్వాత...
హీరో శర్వానంద్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటిస్తున్నారు. వీరిద్దరూ తొలిసారి నటించిన చిత్రం ‘శతమానం భవతి’. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017 జనవరి 14న రిలీజై, సూపర్ హిట్‌గా నిలవడంతో ΄ాటు జాతీయ అవార్డు అందుకుంది. ఈ సినిమాలో క్యూట్ జోడీగా ఆకట్టుకున్న శర్వానంద్, అనుపమ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘శర్వా 38’ (వర్కింగ్ టైటిల్). సంపత్ నంది దర్శకత్వంలో లక్ష్మీ రాధా మోహ¯Œ సమర్పణలో కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1960ల కాలంలోని ఉత్తర తెలంగాణ– మహారాష్ట్రల సరిహద్దు ్ర΄ాంతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూ΄÷ందుతోంది. కాగా ఈ మూవీలో హీరోయిన్ డింపుల్ హయతి ఓ కీలక ΄ాత్ర చేస్తున్నారు.
క్రేజీ కాంబినేషన్
హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్యలది క్రేజీ కాంబినేషన్ అనే చె΄్పాలి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మొదటి చిత్రంతోనే వంద కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన వీరి జోడీ రెండో సారి ప్రేక్షకులను అలరించనుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటగా ‘90స్’(ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాస¯Œ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఓ మధ్య తరగతి యువకుడి ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. ‘బేబీ’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న ఆనంద్–వైష్ణవి రెండోసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాపై యువతలో మంచి ఆసక్తి నెలకొంది.
రెండోసారి...
హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ రెబా మోనికాజాన్‌లది హిట్ పెయిర్. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘సామజ వరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 జూన్ 29న విడుదలై, ప్రేక్షకులను నవ్వించింది. ఆ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికాజాన్ కలిసి నటించిన ద్వితీయ చిత్రం ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలక΄ాటి నిర్మించారు. తొలి చిత్రం ‘సామజ వరగమన’తో నవ్వులు పంచిన శ్రీవిష్ణు, రెబా ‘మృత్యుంజయ్’తో మాత్రం భయపెట్టనున్నారు.
– డేరంగుల జగన్ మోహన్