అన్నిసార్లు పెద్ద సినిమాలే కాదు అప్పుడప్పుడు చిన్న మూవీస్ కూడా అద్భుతాలు చేస్తుంటాయి. ప్రేక్షకుల్ని మనసారా నవ్విస్తాయి. అలాంటి ఓ చిత్రమే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన ఈ సినిమాని ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. రాహుల్ శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు తీసినప్పటికీ తొలి ఆట నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది.
ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసిన మెమొరీ కార్డ్ పోతే.. ఓ ఫొటోగ్రాఫర్ ఎలాంటి తిప్పలు పడ్డాడు? దీని నుంచి వచ్చే కామెడీ అనే సింపుల్ పాయింట్‌తో తీసిన సినిమా ఇది. చెబుతుంటే స్టోరీ ఇంతేనా అనిపిస్తుంది గానీ చూస్తున్నప్పుడు మాత్రం మంచి కామెడీతో అలరిస్తుంది. నవంబరు 7న థియేటర్లలోకి రాగా పాజిటివ్ టాక్‌తో పాటు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబరు 5 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. థియేటర్‌లో మిస్ అయినోళ్లు ఓటీటీలోకి వచ్చాక తప్పక చూడండి.
(ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ)
'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' విషయానికొస్తే.. పల్లెటూరిలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంలో ఆరితేరిన ఫొటోగ్రాఫర్ రమేశ్ (తిరువీర్). స్టూడియోకి ఎదురుగా ఉండే పంచాయతీ ఆఫీస్‌లో పనిచేసే హేమ(టీనా శ్రావ్య)ని ఇష్టపడుతంటాడు. ఆమెకీ రమేశ్ అంటే ఇష్టమే. కట్ చేస్తే రమేశ్ దగ్గరకు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసమని ఆనంద్(నరేంద్ర రవి) వస్తాడు. రాజకీయ కుటుంబానికి చెందిన యువకుడు ఆనంద్. షూట్ అంతా అయ్యాక మెమరీ కార్డ్ తన దగ్గర పనిచేసే సహాయకుడు రాము(మాస్టర్ రోహన్) చేతికి రమేశ్ ఇస్తాడు.
ఆ కుర్రాడేమో మెమొరీ చిప్ ఎక్కడో పడేస్తాడు. అప్పటినుంచి రమేశ్‌కి కష్టాలు మొదలవుతాయి. చిప్ లేదనే సంగతి ఆనంద్‌కి తెలిస్తే ఏమవుతుందోననే భయం ఓవైపు రమేశ్‌ని వెంటాడుతూ ఉంటుంది. మరోవైపు ఈ గండం నుంచి బయటపడాలి. ఈ విషయంలో రమేశ్‌కి హేమ ఏం సాయం చేసింది? చివరకు మెమొరీ చిప్ దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: సారీ చెప్పిన 'రాజు వెడ్స్ రాంబాయి' డైరెక్టర్)


