
చాలామంది బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)కు పాపులారిటీ, డబ్బు కోసమే వెళ్తుంటారు. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాక పూర్తిగా అందులోనే లీనమవుతారు. కొన్నిసార్లు ప్రేమలో పడి బయట ప్రపంచాన్నే మర్చిపోతారు. అలా ఓ నటి నిజంగానే లవ్‌లో పడింది. కానీ అవతలి వ్యక్తి ఫుటేజీకోసం, పాపులారిటీ కోసం ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించాడు. ఈ విషయం తెలిసి సదరు నటి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది.
బ్రేకప్ అయ్యాక హౌస్‌లోకి..
ఈ విషయాన్ని ఎండమోల్ షైన్ ఇండియాలో బిగ్‌బాస్ ప్రాజెక్ట్ హెడ్‌గా పనిచేసే అభిషేక్ ముఖర్జీ వెల్లడించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రియుడితో బ్రేకప్ అయి విపరీతమైన బాధలో ఉన్న ఓ ప్రముఖ నటి బిగ్‌బాస్ షోలో పాల్గొంది. ఆ బ్రేకప్ బాధ నుంచి బయటపడొచ్చన్న ఉద్దేశ్యంతో రియాలిటీ షోకి వచ్చింది. కానీ రోజులు గడిచేకొద్దీ హౌస్‌లోని ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతడు కూడా ప్రేమిస్తున్నట్లు నటించాడు. అది ఆమె గుర్తించలేకపోయింది. అతడు మోసం చేస్తున్నాడని గ్రహించిన రోజు బాధ తట్టుకోలేకపోయింది.
అదే వారం ఎలిమినేట్
తను షోలో ఉన్న విషయం కూడా మర్చిపోయి తెల్లవారుజామున మూడుగంటలకు బాత్రూమ్‌కి వెళ్లి చనిపోయేందుకు ప్రయత్నించింది. ఆమె చేస్తున్న పనిని గ్రహించి మేమంతా సెట్‌లోకి పరిగెత్తి తనను అడ్డుకున్నాం. మా లక్ ఏంటంటే సైకియాట్రిస్ట్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఆయన ముంబై నుంచి వచ్చేవరకు తనతో మాట్లాడుతూ కూర్చున్నాం. పొద్దున ఏడింటివరకు తనతోనే ఉన్నాం. అదే వారం ఆమెను ఎలిమినేట్ చేసి పంపించేశాం అని చెప్పుకొచ్చాడు. ఆ నటి పేరు మాత్రం వెల్లడించలేదు.
బిగ్‌బాస్ ఎన్ని భాషల్లో?
డచ్ రియాలిటీ షో బిగ్‌బ్రదర్ నుంచి పుట్టిందే బిగ్‌బాస్. ఇండియాలో బిగ్‌బాస్.. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ప్రసారమవుతోంది. తెలుగులో బిగ్‌బాస్ 8 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే తొమ్మిదో సీజన్ ప్రారంభం కానుంది. మూడో సీజన్ నుంచి నాగార్జునే ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
చదవండి: యాంకరింగ్‌లో సిండికేట్.. ఈవెంట్లు చేస్తానో, లేదో?: ఉదయభాను
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com