
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌పై తన సోదరుడు ఫైసల్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు. 2000 ఏడాదిలో విడుదలైన 'మేళా' సినిమాలో అమీర్ ఖాన్, ఫైసల్ ఖాన్ కలిసి నటించారు. ఆ సినిమా తర్వాత తమ మధ్య సంబంధాలు తెగిపోయాయని ఫైసల్ ఖాన్ చెప్పారు. ఆ సమయం నుంచి తామిద్దరం వేరుగానే ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఆమీర్‌పై ఫైసల్ తరచుగా షాకింగ్ ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. 2007లో అమీర్ తనను ఒక సంవత్సరం పాటు ఇంట్లోనే బంధించాడని తన గత జీవితం గురించి ఫైసల్ గుర్తు చేసుకున్నాడు.
ప్రస్తుతం ముంబైలో ఒంటరిగానే ఫైసల్ నివసిస్తున్నాడు. తనతో కుటుంబ సభ్యులు ఎవరూ మాట్లాడరని చెప్పాడు. తన తల్లి, సోదరుడితో విభేదాల తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయానని గుర్తచేసుకున్నాడు. తనకు మానసిక వ్యాధి ఉందంటూ కుటుంబ సభ్యులే నమ్మించే ప్రయత్నం చేశారని పేర్కొన్నాడు. గతంలో తనకు ఏవో కొన్ని మందులు బలవంతంగా ఇచ్చేవారని ఇలా తెలిపాడు. ' 2007 సమయంలో నాకు పిచ్చి పట్టిందంటూ ఒక ఏడాది పాటు ఇంట్లోనే ఉంచి తాళం వేశారు. నేను సమాజానికి హాని చేస్తానంటూ చెప్పేవారు. ఆమీర్ స్నేహితుల వల్లే మా మధ్య దూరం పెరిగింది. వారందరు కలిసి నా సోదరుడి బ్రెయిన్ వాష్ చేశారు. ఆమీర్ ఎంటో నాకు తెలుసు. అతను చాలా మంచివాడు. కానీ, అతని స్నేహితుల వల్లే ఇలా చేశాడనిపిస్తుంది.' అని ఫైసల్ చెప్పాడు.
ఫైసల్ ఖాన్ బాలీవుడ్ నటుడు, గాయకుడు కూడా.. సుమారు 20కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అయితే, - 2007లో ఫైసల్ ఖాన్ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆయనను పూణేలో గుర్తించి వైద్య పరీక్షలు చేయించారు.