డిస్కో శాంతి.. ఈ పేరు ఇప్పటి ప్రేక్షకులకు అస్సలు తెలియకపోవచ్చు. ఎందుకంటే 90ల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈమె చాలా సినిమాల్లో నటించారు. స్పెషల్ సాంగ్స్ కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రియల్ స్టార్ శ్రీహరిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె మూవీస్ చేయడం తగ్గించేశారు. కొన్నాళ్లకు పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. చివరగా 1997లో ‘యుద్ధ’ అనే కన్నడ చిత్రంలో కనిపించారు. ఇప్పుడు కొరియోగ్రాఫర్-హీరో-దర్శకుడు లారెన్స్ తమ్ముడు ఎల్విన్ హీరోగా పరిచయమవుతున్న 'బుల్లెట్'తో డిస్కో శాంతి రీఎంట్రీ ఇస్తున్నారు.
(ఇదీ చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జంట)
డిస్కో శాంతి తన సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటంపై ఎల్విన్ ఎమోషనల్ అయ్యాడు. ఇన్ స్టాలో చాలా పెద్ద పోస్ట్ పెట్టి, శాంతి అక్కపై ఉన్న ప్రేమని బయటపెట్టాడు. 'సినిమా, పేరు, ప్రఖ్యాతలు, డబ్బుకు అతీతమైన కొన్ని బంధాలు ఉంటాయి. అలాంటి బంధమే నాకు, డిస్కో శాంతి అక్క మధ్య ఉంది. డిస్కో శాంతి మాకు కేవలం ఒక ఆర్టిస్ట్ లేదా సహనటి మాత్రమే కాదు. నాకు, నా సోదరుడు రాఘవ లారెన్స్‌కు స్వయంగా సోదరి లాంటివారు. ఎన్నో ఏళ్లుగా ఆమెని ఎంతో ప్రేమగా ‘అక్క’ అని పిలుచుకుంటున్నాం'
'28 ఏళ్ల విరామం తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లో నటించడానికి అంగీకరించడం వెనుక డబ్బు, పేరు, గుర్తింపు లాంటి కారణాలేం లేవు. చిన్న వయసులోనే తన కష్టంతో, ప్రతిభతో ఎంతో పేరు, గుర్తింపు సంపాదించుకున్న డిస్కో శాంతిని గతంలో చాలా మంది తమ సినిమాల్లో నటించమని సంప్రదించారు. కానీ నా మొదటి సినిమా కోసం ఆమె అంగీకరించడం వెనుక ఉన్న కారణం మాత్రం మాపై ఉన్న ప్రేమ, ఆప్యాయతే. తన తమ్ముళ్ల సినిమా బాగా రావాలని, వారి తొలి ప్రయత్నం విజయవంతం కావాలని ఆమె కోరుకున్నారు'
'అక్కా.. మీరు ఈ సినిమా చేయడానికి ఎలాంటి కమర్షియల్ ప్రయోజనాన్ని ఆశించలేదు. మీ తమ్ముళ్లపై ఉన్న ప్రేమతోనే ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. మీరు చూపించిన ప్రేమ, నమ్మకాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ‘బుల్లెట్’లో డిస్కో శాంతి పాత్ర చాలా కీలకం. కథలో వచ్చే ఒక ముఖ్యమైన ట్విస్ట్‌కు ఆమె పాత్రే కారణం. ఆమెని కేవలం నటిగా మాత్రమే కాదు నా అభిమాన నటిగా చూస్తాను' అని ఎల్విన్ రాసుకొచ్చాడు. ఇక డిస్కో శాంతి పెద్ద కొడుకు మేఘాంశ్ ఇప్పటికే తెలుగులో హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: బాలకృష్ణతో సినిమా.. రొమాంటిక్ సీన్లపై హీరోయిన్ విమర్శలు)


