ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 201 కోట్లు కలెక్షన్స్ సాధించింది. సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్‌లో మాత్రం దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా ప్రీమియర్స్‌కి నైజాంలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. టికెట్ల రేట్ల పెంపు, ప్రీమియర్‌షోకి ప్రభుత్వం నుంచి ఆలస్యంగా అనుమతి లభించింది.
అర్థరాత్రి వరకు జీవీ రాకపోవడంతో..నైజాం ఏరియాలో ప్రీమియర్స్ పడలేదు. మీడియా కోసం హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌లో ప్రత్యేక షో ఏర్పాటు చేయగా.. విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు. గేట్లు బద్దలుకొట్టుకొని మరీ థియేటర్‌లోకి చొరబడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి.. అందరిని బయటకు పంచింపిన తర్వాత అర్థరాత్రి 12.45 గంటలకు మీడియాకు షో వేశారు. ఈ విషయం తెలిసి చాలా టెన్షన్ పడ్డారట సినిమా దర్శకుడు మారుతి. ఒకవైపు ప్రీమియర్స్ షోకి అనుమతి రాకపోవడం, మరోవైపు మీడియా షో ఆలస్యం అవ్వడంతో టెన్షన్ భరించలేక కారులో కూర్చొని ఏడ్చేశారట. ఈ విషయాన్ని తాజాగా ఆయనే మీడియాతో చెప్పారు.
రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మారుతి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘మీ కెరీర్‌లోనే అతి పెద్ద సినిమా ది రాజాసాబ్ రిలీజ్ రోజు ఎలా ఫీలయ్యారు?’ అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దానికి ఆయన మారుతి సమాధానం చెబుతూ.. ‘నా తొలి సినిమా ‘ఈ రోజుల్లో’ రిలీజ్ రోజు చాలా ఏడ్చేశా. అప్పుడు నాకు ఎదురైన సవాళ్లను చూసి..ఇకపై ఇండస్ట్రీ వైపే రావొద్దనుకున్నా. అలాగే ది రాజాసాబ్ రిలీజ్ రోజు కూడా చాలా టెన్షన్ పడ్డాను. ఒకవైపు నైజాంలో ప్రీమియర్ షోకి అనుమతి రాలేదు. మీడియా కోసం ఏర్పాటు చేసిన షోకి ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వచ్చారనే విషయం తెలిసింది. మీడియా వాళ్లు అర్థరాత్రి వరకు వేచి చూశారనే విషయం తెలిసి బాధపడ్డాను. టెన్షన్ తట్టుకోలేక కారులో కూర్చొని ఏడ్చేశా. ఫ్యాన్స్‌కి ప్రీమియర్ షో వేయలేకపోయామనే బాధతో నేను కూడా సినిమా చూడకుండానే వెళ్లిపోయాను’ అని మారుతి చెప్పుకొచ్చాడు.


