కొత్త ఊపిరి వచ్చినట్లుంది

Dil Raju Speech At Balagam Hundereds of International Awards - Sakshi

– నిర్మాత ‘దిల్‌’ రాజు

‘‘వంద కోట్ల రూపాయల పోస్టర్స్, వంద రోజుల ఫంక్షన్స్‌ చూశాను. కానీ తొలిసారి వంద అవార్డుల ఫంక్షన్‌ను ‘బలగం’తో చూస్తున్నాం’’ అన్నారు ‘దిల్‌’ రాజు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌ రామ్, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బలగం’. ‘దిల్‌’ రాజు ప్రొడక్షన్స్‌పై వేణు ఎల్దండి దర్శకత్వంలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న విడులైంది.

‘బలగం’కు ప్రపంచవ్యాప్తంగా వంద అంతర్జాతీయ అవార్డులు వచ్చినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా విశ్వ విజయ శతకం ఈవెంట్‌లో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘మా పిల్లలు హన్షిత, హర్షిత్‌ నిర్మించిన తొలి సినిమానే వంద అంతర్జాతీయ అవార్డులు సాధించడం గొప్ప విషయం. పెద్ద బడ్జెట్‌తో రాజమౌళి తీసిన ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లకు ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. కానీ ‘బలగం’ చిన్న ఊర్లో నేటివిటీతో తీశాం.

అంతర్జాతీయంగా వంద అవార్డులు వచ్చాయి. ఇటీవల హిట్టయిన ‘సామజ వరగమన’, ‘బేబీ’ వంటి చిత్రాలతో చిన్న, ఫ్యామిలీ చిత్రాలు ఆడతాయనే నమ్మకం మళ్లీ వచ్చింది. కొత్త ఊపిరి వచ్చినట్లయింది’’ అన్నారు. ‘‘బలగం’ తెలంగాణ సినిమాగా ప్రచారమైంది. కానీ తెలుగు సినిమా’’ అన్నారు వేణు. ‘‘నేను, అన్న నిర్మించిన తొలి చిత్రానికి వంద అంతర్జాతీయ అవార్డులు రావడం హ్యాపీ’’ అన్నారు హన్షిత.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top