సెలబ్రిటీలు వరుసగా తమ వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలు పిటిషన్స్ వేయగా.. అదే బాటలో టాలీవుడ్ హీరోలు నడుస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్,పవన్ కల్యాణ్ తమ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లు వేశారు. తమ ఫోటోలు వీడియోలను వాణిజ్య అవసరాలకు వాడుకోవడం ,తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతుందని పిటిషన్‌లో ప్రస్తావించారు. దీనిపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
వీరిద్దరి పిటిషన్లపై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారణ చేపట్టింది. పవన్ కళ్యాణ్,జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు. తప్పుడు వార్తలు,మార్ఫింగ్ ఫోటోలతో అవమానకరంగా పోస్టులు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఫ్లిప్ కార్ట్,అమెజాన్, ఎక్స్,గూగుల్‌ను ప్రతివాదులుగా చేర్చారు. అయితే కొన్ని లింకులను ఇప్పటికే తొలగించామని ప్రతివాదులు కోర్టుకు తెలిపారు. తొలగించని లింకులపై ఆదేశాలు జారీ చేసేముందు వినియోగదారుడి వాదనలు వినాలని కోర్టు అభిప్రాయపడింది. అభిమానుల ఖాతాలో పోస్టులు అని ఇన్‌స్టాగ్రామ్ ప్రత్యేకంగా స్పష్టం చేయాలని కోర్టు సూచించింది. ఈ విషయాన్ని గూగుల్ తమ ఖాతాదారులకు తెలియజేయాలని .. లేదా ఖాతాను నిలిపివేయాలని హైకోర్టు తెలిపింది. వీటికి సంబంధించిన బీఎస్‌ఐ, ఐపీ అడ్రస్‌లు, లాగిన్ వివరాలు 3 వారాల్లో అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది.


