
బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు ధనుష్. తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఆయన ఉన్నారు. తాజాగా కుబేర చిత్రంతో ప్రేక్షకులను మెప్పించాడు. తమిళం, తెలుగు భాషల్లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఇడ్లీ కడై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అలాగే హిందీలో ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరే ఇష్క్ మే' చిత్రం షూటింగ్‌ను పూర్తి చేశారు.
కాగా ఇప్పుడు మరో నూతన చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. దీన్ని వేల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి 'అరువడై' అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇకపోతే ఇందులో నటుడు ధనుష్‌కు జంటగా నటి పూజాహెగ్డేను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇంతకుముందు ఈ చిత్రంలో మాలయాళ బ్యూటీ మమితా బైజు నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా తాజాగా పూజాహెగ్డేను ఎంపిక చేసినట్లు తెలిసింది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

ఇకపోతే గత 12 ఏళ్ల క్రితం జీవాకు జంటగా ముఖముడి చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే ఆ తరువాత విజయ్ సరసన బీస్ట్ చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. అలాగే ఇటీవల సూర్యకు జంటగా రెట్రో చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ధనుష్‌తో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. ఇది ఇక్కడ ఈ అమ్మడు నటించే నాలుగవ చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విష్నేశ్ రాజా కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించనున్నారు.