సినిమా అనేది ఓ మాధ్యమం. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తారా సందేశం ఇస్తారా అనేది హీరోలు, దర్శకనిర్మాతల ఇష్టం. సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు గానీ చెడు మాత్రం చేయకూడదు. కానీ గత కొన్నాళ్ల నుంచి చూసుకుంటే మాత్రం ఈ విషయంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా మాట్లాడుకునే బూతుల్ని పలు సినిమాల్లో యదేచ్ఛగా వాడేస్తున్నారు. మరి వీటిని జనాలకు అలవాటు చేయాలనుకుంటున్నారా? లేదంటే అసలేం చేద్దామనుకుంటున్నారు?
(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్‌లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు)
తెలుగు సినిమాలు కొన్నాళ్ల ముందు వరకు మరీ అంత కాకపోయినా కాస్త పద్ధతిగా ఉండేవి. ఫ్యామిలీ, కామెడీ స్టోరీలతో తీసిన మూవీస్ ఎప్పటికప్పుడు వస్తుండేవి. ఆడియెన్స్ కూడా చాలావరకు కుటుంబంతో కలిసి థియేటర్లకు వెళ్లేవారు. కానీ లాక్‌డౌన్, ఓటీటీల రాకతో ట్రెండ్ మారిపోయింది. నిజంగానే మారిందా లేదంటే దర్శకనిర్మాతలు పరిస్థితులకు తగ్గట్లు మార్చేస్తున్నారా అనేది ఇక్కడ అర్థం కాని విషయం.
ఓటీటీ కంటెంట్‌కి సెన్సార్ లాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. కాబట్టి నచ్చిన డైలాగ్స్ నచ్చిన సీన్స్ పెట్టకోవచ్చు. అందుకే 'మీర్జాపుర్' లాంటి సిరీస్‌లు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ సిరీస్ చాలా ఇంటెన్స్ సబ్జెక్ట్‌తో తీశారు. కానీ బూతులు, యాక్షన్ సన్నివేశాలు దారుణంగా ఉంటాయి. ఈ తరహా కంటెంట్ ఇష్టపడేవాళ్లు వీటిని చూశారు. మిగిలిన వాళ్లు లైట్ తీసుకున్నారు. ఓటీటీ కంటెంట్ వేరు సినిమా కంటెంట్ వేరు. కానీ ఈ రెండింటి మధ్య గీత చెరిగిపోతున్నట్లు అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: హీరోయిన్లపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిన్మయి స్ట్రాంగ్ రిప్లై)
ఎందుకంటే ఈ ఏడాది మార్చిలో నాని 'ద ప్యారడైజ్' సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాంటివి చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోయారు. కానీ చివరలో ఉపయోగించిన ఓ బూతు పదం విని షాకయ్యారు. తల్లిని దూషించేలా ఉండే ఆ పదాన్ని సినిమాలో ఏ సందర్భంలో ఉపయోగించారో తెలీదు కానీ ప్రమోషనల్ వీడియోలో పెట్టడం మాత్రం అవసరమా అనే కామెంట్స్ కొన్ని వినిపించాయి. తాజాగా విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'రౌడీ జనార్థన' టైటిల్ వీడియో లాంచ్ చేశారు. ఇందులోనూ రక్తపాతం, చివరలో బూతుపదాన్ని పెట్టారు.
తెలంగాణ కల్చర్ అంటే పలువురు దర్శకులు మందు తాగడాన్ని చూపించినట్లు.. మాస్ సినిమాలనగానే కొందరు డైరెక్టర్స్, బూతుల్ని యదేచ్ఛగా వాడేస్తున్నారు. ఈ రెండు చిత్రాలే కాదు గతంలో ఇదే విజయదేవరకొండ 'అర్జున్ రెడ్డి'లోనూ బూతులు ఉంటాయి. విశ్వక్ సేన్ 'ఫలక్‌నుమా దాస్'లోనూ అలాంటి డైలాగ్స్ వినిపిస్తాయి. ఇదంతా చూస్తుంటే టాలీవుడ్ దర్శకనిర్మాతలు బూతుల్ని జనాలకు అలవాటు చేసే పనిలో ఉన్నారా అనే సందేహం రావడం గ్యారంటీ!
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)


