ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహుకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌పై హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, దిల్‌రాజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పైరసీ వల్ల సినీ రంగం చాలా నష్టం పోయిందని సజ్జనార్ తెలిపారు. ఆపై అతను 'దమ్ము ఉంటే పట్టుకోండి చూద్దాం ' అన్నాడు దీంతో అతన్ని అరెస్ట్ చేయాలని గట్టిగానే అనుకున్నట్లు సజ్జనార్ చెప్పారు. ఈ క్రమంలోనే చిరంజీవి, దిల్ రాజు కూడా పైరసీ గురించి పలు వ్యాఖ్యలు చేశారు.
దమ్ము ఉంటే పట్టుకోండి అంటూ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి చేసిన సవాల్‌ను ఒక ఛాలెంజ్‌గా స్వీకరించిన తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి చూపించారని చిరంజీవి కొనియాడారు. ఈ క్రమంలోనే పైరసీ అనేది ఇండస్ట్రీకి పెద్ద సవాల్‌గా మారిందని ఇలా చెప్పారు. 'సినిమాను నమ్మకుని కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయి. గత సీపీ సీవీ ఆనంద్‌తో పాటు ప్రస్తుత సీపీ సజ్జనార్ కలిసి పైరసీ భూతాన్ని పట్టుకున్నారు. చాలా ఏళ్ల నుంచి చిత్రపరిశ్రమను పైరసీ అనేది పీడిస్తూనే ఉంది. ఎన్నో కష్టాలను తట్టకుని ఇండస్ట్రీలో సినిమాలను నిర్మిస్తున్నారు.' అని చిరు అన్నారు.
సినిమా పైరసీకి సంబంధించిన కీలక సూత్రధారి రవిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులకు నిర్మాత దిల్ రాజు ధన్యవాదాలు చెబుతూ ఇలా పేర్కొన్నారు. 'మూడు నెలల క్రితమే పైరసీ గురించి అరెస్ట్‌లు మొదలయ్యాయి. ఇలాంటి వెబ్‌సైట్ల వల్ల మీ వ్యక్తిగత డేటా కూడా చోరి అవుతుంది. మేము చాలా కష్టపడి సినిమాలు తీస్తున్నాం. ప్రేక్షకులు కూడా ఇలాంటి వెబ్‌సైట్లను ఎంకరేజ్ చేయకండి. మీకు కూడా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం నెలరోజుల్లోనే ప్రతి సినిమా ఓటీటీలోకి వస్తుంది. సంతోషంగా ఇంట్లోనే చూసేయండి. ఇలాంటి పైరసీ వెబ్‌సైట్స్‌లను ఎంకరేజ్ చేసి పరిశ్రమకు నష్టం చేకూర్చకండి.' అంటూ దిల్ రాజు తెలిపారు.


