
ప్రమాదం ఏ వైపు నుంచి ఎప్పుడు ఎలా వస్తుందో అస్సలు ఊహించలేం. ఇప్పుడు కూడా అలా అనుకోని సంఘటన కారణంగా ఓ బాల నటుడు, అతడి సోదరుడు కన్నుమూశారు. ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతుండగా జరిగిన అగ్ని ప్రమాదం కాస్త ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. దీంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
(ఇదీ చదవండి: 'స్పిరిట్'లో మలయాళీ భామ.. మరో బాలీవుడ్ బ్యూటీ ఔట్!)
హిందీలో 'శ్రీమద్ రామాయణ్', 'వీర్ హనుమాన్' సీరియల్స్‌లో నటించిన వీర్ శర్మ(10), ఇతడి సోదరుడు శౌర్య శర్మ(15) ఆదివారం రాత్రి ఇంట్లో ఓ గదిలో నిద్రపోతున్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగి, అన్నదమ్ములిద్దరూ పడుకుని ఉన్న రూంతో పాటు హాల్ అంతా పొగ వ్యాపించింది. అయితే గాఢనిద్రలో ఉండేసరికి వీర్, శౌర్య కదల్లేక పొగ పీల్చేసి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే పిల్లలిద్దరూ మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ప్రమాదం జరిగే సమయంలో వీర్ తల్లి మరో గదిలో ఉండగా.. తండ్రి బయటకు వెళ్లారు. దీంతో వీళ్లకు ఏమి కాలేదు. చిన్నారులు మాత్రం తుదిశ్వాస విడిచారు. అయితే కొడుకులు చనిపోయారే బాధలో ఉన్నప్పటికీ.. పిల్లలిద్దరూ కళ్లని దానం చేసేందుకు తల్లదండ్రులు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈ విషయం హిందీ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఇప్పటికే సీరియల్స్ చేసిన వీర్.. త్వరలో ఓ హిందీ సినిమాతో బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నాడు. ఇంతలోనే ఇలా జరగడం ఆ పిల్లల తల్లిదండ్రులకు తీరని ఆవేదన మిగిల్చింది.
(ఇదీ చదవండి: 'బాయ్‌కాట్ కాంతార'.. దీని వెనక ఎవరున్నారు? ఇప్పుడే ఎందుకిలా?)
