బాలీవుడ్ నటి, హీరోయిన్ సెలీనా జైట్లీ కోర్టును ఆశ్రయించారు. తన భర్త వేధింపులకు గురి చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. తనపై గృహ హింసకు పాల్పడ్డారని భర్త పీటర్ హాగ్పై ముంబయిలోని అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన వేధింపులతో తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి గురైనట్లు కోర్టుకు తెలిపారు. అతని వేధింపుల కారణంగా సైకోవెజిటేటివ్ ఓవర్‌లోడ్తో బాధపడుతున్నట్లు ప్రస్తావించారు. దాదాపు పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత భర్త పీటర్ హాగ్పై గృహ హింస కేసు పెట్టడం గమనార్హం. దీంతో ఆమె పిటిషన్‌ను విచారించిన కోర్టు డిసెంబర్ 12 లోపు కోర్టు ముందు హాజరు కావాలని హాగ్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే గత వారంలోనే తన భర్త హాగ్‌పై గృహ హింస పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.
కాగా.. బాలీవుడ్ భామ సెలీనా జైట్లీ.. పీటర్ హాగ్‌ను సెప్టెంబర్ 2010లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా భర్త హాగ్ తనను మానసిక, శారీరక హింసకు గురి చేశారని ఆరోపించింది. 2019 తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయాని పిటిషన్లో పేర్కొంది. తన ఆస్తులు, ఆర్థిక నియంత్రణ అతని చేతికి అప్పగించాలని ఒత్తిడి తెచ్చాడని ఆరోపించింది.
నా బిడ్డ, తల్లిదండ్రులు కొన్ని నెలల వ్యవధిలో మరణించిన తర్వాత ముంబయిలోని తన నివాసాన్ని అతని పేరిట మార్చాలని తీవ్ర ఒత్తిడి చేశారని పిటిషన్లో వివరించింది. అయితే అంతకుముందే సెలీనా జైట్లీ జనవరి 14, 2019న తాను రాసిచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయాలని బాంబే సిటీ సివిల్ కోర్టులో దావా వేశారు. కాగా.. గతంలో ఆమె పీటర్‌కు ఉమ్మడి ఇంటి ఆస్తిని బహుమతిగా ఇచ్చింది.


