కథలో, దాన్ని తెరపై చూపించే విధానంలో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా షెడ్డుకు పోవడం ఖాయం! కానీ అపజయం అనేది మా ఇంటావంటా లేదంటూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కెరీర్‌లో ఒక్క పరాజయం కూడా చూడకుండా వరుసగా 9 సూపర్ హిట్లు కొట్టేసి శెభాష్ అనిపించుకున్నాడు. దీంతో అతడి పదో సినిమా ఎవరితో? ఎప్పుడు? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ విషయాన్ని ఓసారి చూసేద్దాం..
ఫస్ట్ సినిమా నుంచే..
అనిల్ రావిపూడి సహాయ దర్శకుడిగా, సంభాషణల రచయితగా కెరీర్ మొదలుపెట్టాడు. 2015లో నందమూరి కల్యాణ్ 'పటాస్' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాకే బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఆ మరుసటి ఏడాది తీసిన సుప్రీమ్ కూడా ఘన విజయం సాధించింది. రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3, భగవంత్ కేసరి.. ఇలా అన్నీ హిట్లు, సూపర్ హిట్లే అందుకున్నాడు.
బ్లాక్‌బస్టర్ సినిమాలు
గతేడాది సంక్రాంతి వస్తున్నాం మూవీతో మరో బ్లాక్‌బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. పొంగల్ పండగను క్యాష్ చేసుకునేందుకు ఈసారి కూడా సంక్రాంతికే బరిలోకి దిగాడు.. కాదు, మెగాస్టార్‌ను బరిలోకి దింపాడు. చిరంజీవితో 'మన శంకరవరప్రసాద్‌గారు' మూవీ తీశాడు. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాగా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.200 కోట్లు దాటేసింది.
సీనియర్ హీరోలతో సినిమాలు
ఈసారైనా అనిల్ రావిపూడి దొరుకుతాడేమోనని చూసిన ట్రోలర్స్‌కు భంగపాటే ఎదురైంది. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ.. ఇలా అందరు సీనియర్ హీరోలతో సినిమాలు చేశాడు అనిల్. మరి నాగార్జునతో ఎప్పుడు? అని అతడి ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మంచి కథ, సమయం కుదిరితే ఆయనతో కచ్చితంగా సినిమా చేస్తానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హామీ ఇచ్చాడు.
చిరంజీవి బంపరాఫర్
మరోవైపు మెగాస్టార్.. తనకు అఖండ విజయాన్ని అందించాడన్న ఆనందంతో ఓ బంపరాఫర్ ఇచ్చాడు. అనిల్ కథ సిద్ధం చేస్తే.. తాను, వెంకటేశ్ కలిసి పూర్తిస్థాయి సినిమా చేస్తామన్నాడు. అవసరమైతే వెంకీ సినిమాలో అతిథి పాత్రలోనైనా కనిపించేందుకు సిద్ధమన్నాడు. ఇంత మంచి ఆఫర్ ఇస్తే అనిల్ ఎందుకు కాదంటాడు? కానీ, వెంటనే ఒప్పేసుకుని సినిమా చేసే పరిస్థితి లేకపోవచ్చు.
రామ్‌చరణ్‌తో సినిమా!
మన శంకరవరప్రసాద్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనిల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 'రామ్‌చరణ్‌తో సినిమా తప్పకుండా చేస్తాను. ముందు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ చేయండి.. వెంటనే రామ్‌చరణ్ దగ్గరకు వెళ్లిపోతాను' అన్నాడు. అతడు కోరినట్లుగానే ప్రేక్షకులు సినిమాకు మంచి విజయాన్ని అందించారు. మరి అనిల్.. చరణ్‌తో సినిమా చేస్తాడా? అన్నది చూడాలి!
పదో సినిమాపై బజ్
అసలే అనిల్ రావిపూడి కెరీర్‌లో 10వ సినిమా.. హిట్ స్ట్రీక్ పోకుండా మూవీ తీయాలన్న ఒత్తిడి అతడిపై చాలానే ఉంది. కథ, హీరో ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. అది ఏమాత్రం బెడిసికొట్టినా అనిల్ రావిపూడిని ఆడేసుకుంటారు. మళ్లీ బ్లాక్‌బస్టర్ ఇచ్చాడంటే మాత్రం నెత్తిన పెట్టేసుకుంటారు. మరి ఆ పదో సినిమా చరణ్‌తోనా? చిరు-వెంకీతోనా? నాగ్‌తోనా? లేదంటే వేరే హీరోతోనా?అన్నది రానున్నరోజుల్లో చూడాలి!


