కన్నడ ప్రముఖ నటుడు ఉపేంద్ర (Upendra) దంపతుల ఫోన్స్ కొద్దిరోజుల క్రితం సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. ఆపై వారి పేరును ఉపయోగించి కొంత డబ్బు కూడా కొట్టేశారు. ఈ మోసానికి పాల్పడిని వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన కుమార్ అనే యువకుడు పక్కా ప్లాన్‌తో ఈ నేరం చేసినట్లు గుర్తించారు. అయితే, అదే ప్రాంతంలో మరో 150 మంది యువకులు ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు కొనుగొన్నారు.
ఉపేంద్ర భార్య ప్రియాంక ఆన్‌లైన్‌లో ఒక వస్తువు ఆర్డర్ చేశారు. తర్వాత ఆమెకు ఒక కాల్ వచ్చింది. బుక్ చేసుకున్న వస్తువు కన్ఫరమేషన్ కోసం కొన్ని హ్యాష్‌ట్యాగ్స్, నంబర్లు ఎంటర్ చేస్తే డెలివరీ అవుతుందని ఫోన్‌లో చెప్పారు. వారు చెప్పినట్లు ఆమె చేయడంతో తన ఫోన్ వెంటనే హ్యాక్ అయింది. ఆ తర్వాత ఉపేంద్ర ఫోన్ కూడా హ్యాక్ అయింది. దీంతె ఆమె వాట్సాప్ సైబర్ కేటుగాళ్ల చేతిలోకి వెళ్లిపోయింది. ఆమె నంబర్ నుంచి రూ. 50 వేలు డబ్బు కావాలంటూ తన సన్నిహితులకు మెసేజ్ పంపారు.
దీంతో ఆమె అభ్యర్థన నిజమైనదేనని భావించి కొందరు డబ్బు పంపారు. ఆమె కుమారుడు కూడా తన తల్లి నుండి వచ్చిన మెసేజ్ నమ్మి రూ. 50 వేలు బదిలీ చేశాడు. ఇలా మొత్తంగా రూ. 1.5 లక్షలు దోచేశారు. వెంటనే ఆమె గుర్తించి అప్రమత్తం కావడం ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించాను అయితే, సుమారు రెండు నెలల తర్వాత నిందితుడిని పట్టుకున్నారు. బీహార్ నుంచి అతన్ని బెంగళూరుకు తీసుకొచ్చి విచారిస్తున్నారు.


