Lahari Shari: లహరి ఎలిమినేట్‌ అవడానికి కారణాలివే!

Bigg Boss Telugu 5: Lahari Shari Eliminated For These Reasons - Sakshi

Bigg Boss Telugu 5, Lahari Shari Eliminated: లహరి షారి.. తన గురించి ఎవరేం అనుకుంటున్నా పట్టించుకోదు. కానీ తన ఎదురుగా నిలబడి మాట్లాడితే మాత్రం దానికి గట్టి సమాధానమే ఇస్తుంది. కాన్ఫిడెన్స్‌కు నిలువుటద్దంలా కనిపించే లహరికి కాస్త ఆవేశం ఎక్కువే. అందుకే బిగ్‌బాస్‌ ఇంట్లో చీటికీమాటికీ గొడవలు పెట్టుకుంటూ బ్యాడ్‌ నేమ్‌ తెచ్చుకుంది. తన కళ్లముందు ఏదైనా తేడాగా అనిపిస్తే చాలు ఆ అంశాన్ని లేవనెత్తి చీల్చి చెండాడేది. ముఖ్యంగా ఈ అర్జున్‌రెడ్డి భామకు, కాజల్‌కు పెద్దగా పడేది కాదు. మొదట్లో ఫైర్‌ బ్రాండ్‌గా కనిపించిన లహరి ఈ మధ్య కాస్త డల్‌ అయిపోయినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన లహరి మూడో వారానికే తట్టాబుట్టా సర్దుకుని బయటకు వచ్చేసింది. మరి ఆమె ఎలిమినేషన్‌కు గల కారణాలేంటో చూసేద్దాం..

► బిగ్‌బాస్‌ షో ప్రారంభమైన ఫస్ట్‌ వీక్‌లోనే గొడవలతోనే బాగా హైలైట్‌ అయింది లహరి. ముఖ్యంగా కాజల్‌ అత్యుత్సాహం ప్రదర్శించిన ప్రతిసారి ఆమె దూకుడుకు బ్రేక్‌ వేసింది. ఇలా హౌస్‌లో ఎవరికీ అదరకుండా బెదరకుండా వ్యవహరిస్తూ ముక్కుసూటిగా, కుండ బద్ధలు కొట్టి మాట్లాడే లహరిని మొదట్లో అంతా మెచ్చుకున్నారు. కానీ ప్రతి చిన్న విషయానికి కూడా ఆమె కయ్యానికి కాలు దువ్వడంతో ఆమెను మెచ్చుకున్నవాళ్లే విమర్శించక తప్పలేదు.

► ఇంట్లోని కంటెస్టెంట్లలో లహరికి దగ్గరైనవాళ్లలో మానస్‌ ఒకరు. అయితే ఇది గిట్టని ప్రియ, ప్రియాంక సింగ్‌, సిరి.. మానస్‌ దగ్గరకు వచ్చి ఆమె కన్నింగ్‌ అని, లహరితో జాగ్రత్త అని చెప్పారు. అంతేకాకుండా ఆమె డ్రెస్సింగ్‌ గురించి కూడా తప్పుగా మాట్లాడారు. ఈ విషయాన్ని మానస్‌ లహరితో కూడా చెప్పాడు. అంటే హౌస్‌లో లహరిని కొంత టార్గెట్‌ చేశారని అర్థమవుతోంది.

► హౌస్‌లో ఉన్నవాళ్లతో పాటు బయటకు వచ్చిన ఉమాదేవి కూడా లహరి షోలో కొనసాగడం వేస్ట్‌ అని అభిప్రాయపడ్డారు. దీంతో నిజంగానే హౌస్‌లో లహరి ఏం చేస్తుందన్న ప్రశ్న తలెత్తింది. ఇప్పటివరకు ఏదైనా టాస్కు గెలిచిందా? అంటే లేదు. ఏమైనా ఎంటర్‌టైన్‌ చేసిందా? అంటే అదీ లేదు. దీనికి తోడు నామినేషన్స్‌లో ఉన్న ఐదుగురిలో తక్కువ పాపులారిటీ, తక్కువ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది లహరికి మాత్రమే. దీంతో ఆమెకు మొదటి నుంచే తక్కువ ఓట్లు నమోదైనట్లు తెలుస్తోంది.

► లహరి ఎలిమినేషన్‌కు ముఖ్య కారణం ప్రియ, రవి. వీళ్లిద్దరూ తెలిసో, తెలియకో ప్రేక్షకుల ముందు లహరిని బ్యాడ్‌ చేశారు. యాంకరింగ్‌ కోసం తన వెనకాల పడుతుందని రవి, ఇంట్లో మగాళ్లతో బిజీ అని ప్రియ కామెంట్లు చేయడంతో ఆమె మీద కొంత వ్యతిరేకత ఏర్పడింది. అదే సమయంలో ఆమె అన్యాయంగా బలవుతుందంటూ కొంత సానుభూతి ఏర్పడ్డప్పటికీ అది ఆమెను ఎలిమినేషన్‌ నుంచి గట్టెక్కించలేకపోయాయి.

► ఇవి కాకుండా బిగ్‌బాస్‌ త్వరలో ఓ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీకి ప్లాన్‌ చేస్తున్నాడని, అందుకే లహరిని ఎలిమినేట్‌ చేసి ఆ స్థానాన్ని వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌తో భర్తీ చేసే ప్లాన్‌లో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇదెంతవరకు నిజమన్నది రానున్న రోజుల్లో తెలియనుంది.

ఏదేమైనా లహరి ఎలిమినేట్‌ కావడాన్ని ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. తనేంటో నిరూపించుకునేందుకు ఇంకొన్ని రోజులు హౌస్‌లో ఉండనివ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top