
గతంలో బిగ్‌బాస్ 8 సీజన్లు జరిగితే కొన్నింట్లో కామనర్స్ పేరిట ఒకరిద్దరికి అవకాశాలు ఇచ్చారు. ఉన్నంతలో వాళ్లు బాగానే ఆడారు. ఈసారి మాత్రం సామాన్యులకి పెద్ద ఛాన్స్ ఇచ్చారు. అగ్నిపరీక్ష అనే పోటీ పెట్టి ఏకంగా ఆరుగురిని హౌసులోకి పంపించారు. ఇప్పుడు బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ మరో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వారం మధ్యలో మరో ముగ్గురు సామాన్యులని హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా పంపించాలని అనుకుంటోందట.
9వ సీజన్ రెండు వారాలు పూర్తయింది. తొలివారం శ్రష్ఠి వర్మ, రెండో వారం కామనర్ మనీష్ ఎలిమినేట్ అయ్యారు. మిగతా 13 మంది హౌసులో ఉన్నారు. అయితే సామాన్యులుగా వెళ్లిన వారిలో ప్రస్తుతం హౌసులో ఐదుగురు ఉన్నారు. వీళ్లందరూ ఒకరితో ఒకరి పోటీపడి మరీ విసిగిస్తున్నారు. ఒక్కొక్కరు ఆటిట్యూడ్ చూపిస్తూ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నారు. మరి ఇదే విషయం మేనేజ్‌మెంట్‌కి అర్థమైందో ఏమో గానీ సామాన్యుల్లో ఒకరిద్దరిని ఎలిమినేట్ చేసేసి కొత్తవాళ్లని హౌసులోకి తీసుకురావాలని అనుకుంటున్నారట.
(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్.. ‘ఓజీ’ షోలు క్యాన్సిల్!)
ఈ వారం మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా దివ్య నిఖిత, షకీబ్, నాగ ప్రశాంత్ రాబోతున్నారని తెలుస్తోంది. అయితే వీళ్లు ఓ రోజు పాటు హౌసులో ఉంటారు. వీళ్లకు కొన్ని పోటీలు పెడతారు. వీటిలో ఎవరైతే నెగ్గుతారో వాళ్లలో ఒకరిని హౌస్‌మేట్‌గా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. దాదాపు ఇలానే వచ్చే వారం కూడా పోటీ పెట్టి బయటనున్న సామాన్యుల్లో ఒకరిని హౌస్‌లోకి పంపిస్తారని టాక్. ఇలా ఈ వారం, వచ్చే వారం ఇద్దరు కామనర్స్‌ని పంపించి.. ఐదో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ప్లాన్ చేసే ఆలోచనలో టీమ్ ఉందని సమాచారం.
ఒకవేళ ఇదే నిజమైతే గనక ఇప్పుడు ఉన్న సామాన్యుల్లోని ఇద్దరిని కచ్చితంగా ఈ రెండు వారాల్లోనే బయటకు పంపే అవకాశాలున్నాయి. లేదంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఎలిమినేట్ అయ్యే దురదృష్టవంతులు ఎవరు? హౌసులోకి వచ్చే అదృష్టవంతులైన కామనర్స్ ఎవరనేది చూడాలి? ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై ఓ క్లారిటీ రావొచ్చు.
(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్.. ఇన్నాళ్లకు ఒప్పుకొన్న ఓం రౌత్)