
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5వ వారం నామినేషన్స్ కార్యక్రమం పూర్తి అయింది. అయితే, కెప్టెన్ రాము రాథోడ్ మినహా అందరినీ నామినేషన్స్‌లోకి బిగ్‌బాస్ తీసుకెళ్లాడు. కానీ, మళ్లీ వారికి ఒక ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్స్ నుంచి తప్పించుకునేందుకు ఇమ్యూనిటీ టాస్క్ ఇవ్వడంతో అందరూ గందరగోళంలో పడ్డారు. ఫైనల్‌గా ఇమ్మాన్యుయేల్ (Emmanuel) టాస్క్‌లో గెలిచి ఇమ్యూనిటీని సాధించుకున్నాడు.
బిగ్‌బాస్ రణరంగంలో భాగంగా కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిపించారు. ఇమ్యూనిటీ కోసం మీరు చేస్తున్న యుద్ధంలో గెలవాలంటే నామినేట్ అయిన సభ్యులందరూ బెడ్‌పైకి ఎక్కి మిగిలిన సభ్యుల్ని ఒక్కొక్కరినీ బెడ్ నుంచి కిందకి దింపాల్సి ఉంటుంది. ఎవరైతే ఆ బెడ్‌పై ఎక్కువ సమయం ఉంటారో వారు ఇమ్యూనిటీకి అంత చేరువ అవుతారని చెప్తారు. ఈ గేమ్‌లో బలమైన కంటెస్టెంట్స్ డీమాన్, కళ్యాణ్, ఇమ్మూ, భరణి ఒక టీమ్‌గా అయిపోయి.. వారి ప్రయారటీ ప్రకారం వరుసుగా బెడ్‌పై నుంచి కిందకు తోసేస్తారు. మొదటి రౌండ్‌లో సంజన, తర్వాతి రౌండ్‌లో సుమన్ శెట్టిని టార్గెట్ చేశారు. ఆ తర్వాత దివ్య,డీమాన్, శ్రీజ ఆట నుంచి విరమిస్తారు.

శ్రీజను బలంగా నెట్టేసిన భరణి
చివరి రౌండ్‌లో భరణి, శ్రీజ, తనూజ, కళ్యాణ్, ఇమ్మూ, మాత్రమే ఉన్నారు. వీరిలో ఒక్కరిని మాత్రమే కిందకు తోసేయాలి. అయితే, గతంలో ఒకసారి తనూజకి ఇమ్యూనిటీ వచ్చిందని తనని తోసేద్దామని శ్రీజ సలహా ఇచ్చింది. ఆ మాటలకు కళ్యాణ్‌తో పాటు ఇమ్మూ కూడా సపోర్ట్ చేస్తాడు. కానీ, భరణి, తనూజకి సపోర్ట్ చేయాలనుకుంటాడు. ఇలా వారందరూ చర్చలు చేస్తున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా భరణి ఒక్కడే శ్రీజని బలంగా కిందకి తోసేశాడు. ఈ క్రమంలో శ్రీజకి గాయం కూడా అయింది. దీంతో శ్రీజను ఓదార్చేందుకు భరణి వెళ్తాడు. ఇలా మంచితనంగా నటించకండి అన్నా అంటూ భరణిపై శ్రీజ పైర్ అవుతుంది. చర్చలు జరుపుతున్న సమయంలో ఇలా తోసేయడం ఏంటి అంటూ సీరియస్ అయింది. మంచోడిలా నటించకండి. నీలా మంచిదానిలా నటించడం నాకు రాదన్నా.. అంటూ బాధ పడుతుంది. రేలంగి మావయ్యలా నటిస్తున్నావంటూ భరణిని శ్రీజ దుమ్ములేపింది. ఇక్కడ గెలిచిన భరణి, తనూజ, కళ్యాణ్, ఇమ్మూలకు గాలి- నిప్పు- నీరు టాస్క్‌ను బిగ్‌బాస ఇస్తాడు. ఇందులో విజేతగా ఇమ్మాన్యుయేల్ నిలుస్తాడు.

కన్నీళ్లు పెట్టుకున్న దివ్య
ఈ టాస్క్‌లో అమ్మాయిల నుంచి ఎక్కువగా పోరాడింది దివ్య మాత్రమే... నమ్మిన భరణి కూడా తనకు సాయం చేయకపోవడంతో ఆమె బాధ పడింది. భరిణి ఎక్కువగా తనూజకు మాత్రమే అండగా నిలబడటం దివ్య సహించలేకపోయింది. బెడ్ మీద నుంచి తనను తోసేస్తున్నా కూడా భరణి అడ్డు పడలేదు. ఆపై అమ్మాయిలు ఎవరూ కూడా ఆమె కోసం నిలబడలేదు. దీంతో దివ్య కన్నీళ్లు పెట్టుకుంది.

విలన్‌గా భరణి..
బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో చివర రౌండ్ జరుగుతున్న సమయంలో మాటల్లో పెట్టి శ్రీజను భరణి తోసేశారు. ఈ విషయంలో ఆయనపై విమర్శలు వచ్చాయి. గతంలో తనూజకు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఆమె కిందకు పంపితే బాగుంటుందని శ్రీజ చెబుతుంది. అందరూ శ్రీజ కరెక్ట్ అంటున్న సమయంలో తనూజ కోసం భరణి చేసిన పని ఎంత మాత్రం కరెక్ట్ కాదని ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుంది. ఈ టాస్క్‌లో దివ్య తర్వాత ఎక్కువగా గేమ్ ఆడింది కూడా శ్రీజానే.. కానీ, తనూజ మాత్రం కనీసం ఆటలో భాగం కాకుండా అలా ఉండిపోయింది. ఆమెను సేవ్ చేసి శ్రీజను తొలగించడం ఎవరికీ నచ్చలేదు. గతంలో సుమన్‌కు ఇమ్యూనిటీ వచ్చిందనే కదా కిందకు తోసేశారు.. మరి తనూజాను ఎందుకు తోయలేదంటూ భరణిని ప్రశ్నిస్తుంది. ఇలా బుల్లెట్ లాంటి ప్రశ్నలతో శ్రీజ దుమ్ములేపుతుంది. రేలంగి మామయ్య రూపంలో ఉన్న విలన్ భరణి అంటూ విమర్శలు వస్తున్నాయి.